Share News

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 1-డే కౌంట్‌డౌన్ ఈవెంట్

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:59 PM

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేకంగా 1-డే కౌంట్‌డౌన్ ఈవెంట్ నిర్వహించారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 1-డే కౌంట్‌డౌన్ ఈవెంట్
International Yoga Day 2026

హైదరాబాద్, జూన్ 20: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేకంగా 1-డే కౌంట్‌డౌన్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీలు లక్ష్మణ్, ఈటెల రాజేందర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 12వ ప్రపంచ యోగా దినోత్సవం కౌంట్ డౌన్ కార్యక్రమానికి అందరికీ స్వాగతమని అన్నారు. రేపు(ఆదివారం) 200 దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో పాల్గొంటాయని తెలిపారు.


yoga-count-kishan.jpg

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోల్‌కతాలో జరిగే యోగా వేడుకల్లో పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు. గత 12 ఏళ్లుగా కోల్‌కతాలో యోగా దినోత్సవ వేడుకలు జరగలేదన్నారు. యోగా డే సెలబ్రేషన్స్ కోసం నెల రోజులుగా అందరూ కలిసి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. గత ఏడు సంవత్సరాలుగా యోగా వేడుకలకు 24 గంటల ముందు కౌంట్ డౌన్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.


yoga-coun-1.jpg

భారత్ అందించిన గొప్ప కానుక యోగా: వెంకయ్య నాయుడు

రేపు యోగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. యోగా ఒక మతానికి పరిమితం కాదన్నారు. యోగా చేస్తే సమగ్ర మనిషిగా మారుతారని తెలిపారు. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక యోగా అని చెప్పుకొచ్చారు. సర్వమానవ, సౌభ్రాతృత్వం, సర్వతోముఖాభివృద్ధికి యోగా అవసరమన్నారు. మానవ చైతన్యానికి నిదర్శనం యోగా అని పేర్కొన్నారు. పూర్వీకులు రంగరించి మనకు అందించిన జీవన విధానం యోగా అని.. ఆరోగ్య, ఆధ్యాత్మిక, మానసిక ఒత్తిడి, స్థైర్యాన్ని ఇచ్చేది యోగా అని అన్నారు. యోగా అనేది మనిషికి, ప్రకృతిమాత అందించిన గొప్ప వరమన్నారు. ప్రకృతి ఒడిలో ప్రజలు జీవించాలని.. ఆరోగ్యమే మహాభాగ్యమన్న మాటను నిజం చేయాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.


 Yoga Day Countdown

యోగా శుభాకాంక్షలు: ఈటెల

ప్రపంచానికి జీవన విధానాన్ని అందించిన దేశం భారత్ అని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. దేశాన్ని విశ్వ గురు స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ నిలబెట్టారని తెలిపారు. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆరోగ్యం ప్రతి ఒక్కరికీ అవసరం: లక్ష్మణ్

ప్రపంచానికి యోగాను అందించిన దేశం భారత్ అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ప్రాచీన సంస్కృతిలో భాగమే యోగా అని తెలిపారు. ఆధ్యాత్మిక, ఆరోగ్య చింతన ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు.


అందరూ యోగా చేయాలి: రాంచందర్ రావు

yoga-count.jpg

నరేంద్రమోదీ 12 సంవత్సరాల క్రితం యోగాను ప్రపంచానికి పరిచయం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ప్రపంచ దేశాల్లో యోగాను చేస్తున్నారని.. యోగా వలన డిప్రెషన్ నుంచి బయటకు వస్తారని అన్నారు. పిల్లలు, తల్లిదండ్రులు అందరూ యోగా చేయాలన్నారు.


యోగా అంటే నాకు పిచ్చి: నవీన్ పొలిశెట్టి

యోగా కార్యక్రమనికి వచ్చిన అందరికీ స్వాగతమని సినీ హీరో నవీన్ పొలిశెట్టి తెలిపారు. ‘నాకు యోగా అంటే చాలా పిచ్చి. నేను ఒకే ఆసనంలో 5 గంటలు ఉండగలను. అదే శవాసనం’ అంటూ అందరినీ నవ్వించారు. తనకు ఒక యాక్సిడెంట్ జరిగిందని, దాంతో తీవ్రమైన బ్యాక్‌ పెయిన్‌ ఉండేదని తెలిపారు. అందులో నుంచి బయటకు రావడానికి యోగా చాలా ఉపయోగపడిందని నవీన్ పొలిశెట్టి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

నిరంజన్ ఇంటికి బండ్ల గణేష్.. రూ. 5 లక్షల చెక్ అందజేత..

SIRపై అప్రమత్తంగా ఉండాలి.. లేకపోతే నష్టపోతాం: మంత్రి తుమ్మల నాగేశ్వరావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 20 , 2026 | 01:19 PM