లాటరీలో గెలవగానే ఇల్లు వచ్చినట్లు కాదు!
ABN , Publish Date - Sep 05 , 2026 | 11:00 AM
ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ పథకంలో లాటరీలో గెలుపొందాం కదా.. ఇల్లు వచ్చిందని సంబరపడిపోతున్నారా.. అయితే ఆగండి. ప్రస్తుతం ఈ ఇళ్లపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దరఖాస్తు చేసిన నియోజకవర్గంలో నివాసముంటేనే అర్హత
క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తయ్యాకే ఇళ్ల కేటాయింపు
మొబైల్ యాప్‌లో లబ్ధిదారుల వివరాలు నమోదు
అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
హైదరాబాద్ సిటీ: ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ పథకంలో లాటరీలో గెలుపొందాం కదా.. ఇల్లు వచ్చిందని సంబరపడిపోతున్నారా.. అయితే ఆగండి. ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌లో ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న అదే అసెంబ్లీ నియోజకవర్గంలో నివాసముంటూ, డాక్యుమెంట్లు (ఎస్సీ/ఎస్టీ కులధ్రువీకరణ పత్రాలు) క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించిన తర్వాతే.. అన్నీ కరెక్టుగా ఉంటే మాత్రమే మీకు ఇందిరమ్మ ఇల్లు దక్కుతుంది. 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లకు లాటరీ ప్రక్రియ పూర్తిచేసిన హౌసింగ్‌బోర్డు అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలు తనిఖీ చేస్తూ వాటిని ప్రత్యేకంగా రూపొందించిన యాప్ (మొబైల్ అప్లికేషన్)లో అప్‌లోడ్ చేస్తున్నారు.
శేరిలింగపల్లిలో శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన అధికారులకు కొత్త అనుభవాలు ఎదురయ్యాయి. ఓ దరఖాస్తుదారురాలు కొన్నేళ్ల క్రితం వరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నివాసముండి, ప్రస్తుతం ఆ కుటుంబం కూకట్‌పల్లి నియోజకవర్గానికి మారింది. లాటరీలో గెలుపొందిన ఆ మహిళ దరఖాస్తు చేసుకున్న అదే అసెంబ్లీ నియోజవర్గంలో నివాసముండకపోవడంతో ఆమె పేరు అనర్హత జాబితాలో చేరింది. కూకట్‌పల్లి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఓ లబ్ధిదారురాలు ఇంటికి వెళ్లి వివరాలు సేకరించగా ఆ మహిళవద్ద (ఎస్సీ/ఎస్టీ) కుల ధ్రువీకరణ పత్రం లేదు. ఇలా పలు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లిన అధికారుల యాప్‌లో పక్కా వివరాలు నమోదుతో అర్హుల జాతితాలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
పరిశీలన ఎందుకంటే..
ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే సమయం లో ఎటువంటి ధ్రువపత్రాలను స్వీకరించ లేదు. ఈ నేపథ్యంలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇచ్చిన వివరాల్లోని వాస్తవికతను నిర్ధారించుకోవడానికి క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అద్దె ఇంట్లో ఉంటున్నారా, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్థితిగతులు (ఆర్‌సీసీ, రేకుల షెడ్ వంటివి), ఇంటిలో ఉంటున్న వారు ఏం చేస్తున్నారు.. వంటి వివరాలతో పాటు, ఎంతకాలంగా ఆ ఇంటిలో నివసిస్తున్నారు మొదలైన అంశాలను తెలుసుకుని యాప్‌లో అక్కడికక్కడే అప్‌లోడ్ చేస్తున్నారు. పదేళ్లుగా నివసిస్తున్నారా లేదా, ఒకవేళ 10 ఏళ్లు పూర్తికాకపోతే, అంతకు ముందు ఎక్కడ నివసించారు తదితర అంశాలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆయా అంశాలపై ధ్రువపత్రాలతో పాటు, వారు ప్రస్తుతముంటున్న ఇళ్ల ఫొటోలను కూడా యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
స్థానికత ఆధారంగానే..
ప్రస్తుతం స్థానికంగా నివాసముంటున్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లాటరీలో గెలుపొందిన లబ్ధిదారుల వివరాలు క్షేత్రస్థాయి అధికారుల పరిశీలన తర్వాత మారిపోతున్నాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం లాటరీలో 480మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా వారిలో 60 శాతం మంది వరకు ఇతర నియోజకవర్గాల నుంచి దరఖాస్తు చేసుకున్నవారు అర్హత సాధించారు. ఈ తరహాలోనే మరిన్ని నియోజకవర్గాల్లో లాటరీలో గెలుపొందిన వారు అదే నియోజకవర్గంలో ప్రస్తుతం నివాసముంటున్నారా, లేదా ఇతర నియోజకవర్గంలో నివాసముంటున్నారా అనే వివరాలకు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి 80 మంది హౌసింగ్‌బోర్డు అధికారులు బృందం పరిశీలిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు...
Read Latest AP News And Telangana News And International News And Telugu News