యూఎస్ ఓపెన్: గంజాయి వాసన వస్తోందని మ్యాచ్ ఆపేసిన సబలెంకా
ABN , Publish Date - Sep 05 , 2026 | 10:30 AM
యూఎస్ ఓపెన్ టోర్నీలో ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకాకు ఓ వింత అనుభవం ఎదురైంది. కోర్టు చుట్టు పక్కల నుంచి గంజాయి వాసన వస్తోందని ఆమె మ్యాచ్‌ను కాసేపు ఆపించింది.
ఇంటర్నెట్ డెస్క్: యూఎస్ ఓపెన్ టోర్నీలో ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకాకు ఓ వింత అనుభవం ఎదురైంది. కోర్టు చుట్టు పక్కల నుంచి గంజాయి వాసన వస్తోందని ఆమె మ్యాచ్‌ను కాసేపు ఆపించింది. శుక్రవారం ఉజ్బెకిస్థాన్‌కు చెందిన కమిల్లా రఖిమోవాతో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో సబలెంకా 3-0 ఆధిక్యంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాను సర్వీస్ చేస్తుండగా కోర్టులోకి గంజాయి వాసన ఘాటుగా వస్తోందని అంపైర్‌కు ఫిర్యాదు చేసింది.
‘ఎవరో గంజాయి తాగుతున్నారు. వాసన చాలా ఎక్కువగా, ఘాటుగా వస్తోంది. దయచేసి ఏదైనా చేయండి’ అంటూ సబలెంకా అంపైర్‌కు చెప్పింది. అయితే స్టేడియంలో ధూమపానం అనుమతించరు. కానీ న్యూయార్క్‌లో 21 ఏళ్లు దాటిన వారు గంజాయి తాగడం చట్టబద్ధమే. ఆ ఘటన తర్వాత మ్యాచ్ యథావిధిగా కొనసాగింది. ఈ వింత ఘటనను పక్కనపెడితే.. సబలెంకా కోర్టులో అదరగొట్టింది. రఖిమోవాపై 6-3, 6-4 తేడాతో విజయం సాధించి యూఎస్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే మ్యాచ్ అనంతరం సబలెంకా ఈ ఘటనపై స్పందించింది. ‘ఎవరైనా వాళ్లకు నచ్చినట్లు ఉండటంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ టెన్నిస్ కోర్టు సమీపంలో గంజాయి లాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. అత్యుత్తమ స్థాయిలో ఆడేందుకు మేము ప్రయత్నిస్తున్నప్పుడు ఆ వాసన తట్టుకోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది’ అంటూ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. బ్యాకప్‌గా ప్రిన్స్ యాదవ్!
వన్డేల్లో విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాటర్: గ్లెన్ మ్యాక్స్‌వెల్