Share News

బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. బ్యాకప్‌గా ప్రిన్స్ యాదవ్!

ABN , Publish Date - Sep 05 , 2026 | 07:43 AM

సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు ముందు భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. బ్యాకప్‌గా యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను తీసుకోనున్నట్లు సమాచారం.

బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. బ్యాకప్‌గా ప్రిన్స్ యాదవ్!
Jasprit Bumrah

ఇంటర్నెట్ డెస్క్: సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు ముందు భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అఫ్గాన్ సిరీస్, ఆసియా గేమ్స్ కోసం బుమ్రాకు జట్టులో చోటు దక్కినప్పటికీ ఫిట్‌నెస్‌పై ఆధారపడి తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే అతడికి బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ రాలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో బుమ్రా మోకాలికి గాయమైంది. అయితే ఇప్పుడు ఆ సమస్య తిరగబెట్టినట్లు సమాచారం. అఫ్గాన్ సిరీస్‌కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. బుమ్రాకు బ్యాకప్‌గా ఎవరిని తీసుకుంటారనే విషయంపై చర్చ నడుస్తోంది.


బుమ్రా విషయంలో స్పష్టత లేకపోవడంతో సెలెక్టర్లు ముందు జాగ్రత్తగా యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను బ్యాకప్‌గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, బుమ్రాతో పాటు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా కూడా ఫిట్‌నెస్ పరీక్షలు ఎదుర్కోనున్నారు. వీరికి వారం రోజుల వ్యవధిలో మ్యాచ్‌ సిమ్యులేషన్‌ టెస్టులు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ పరీక్షల్లో ఫలితాలు సంతృప్తికరంగా వస్తేనే సెప్టెంబర్ 10న ఢిల్లీలో జట్టుతో కలిసేందుకు అనుమతించే అవకాశముంది.


కోచ్, సెలెక్టర్లదే బాధ్యత: మాజీ క్రికెటర్

బుమ్రా విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ వ్యవహరించిన తీరుపై భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘గతేడాది జనవరి నుంచి బుమ్రా ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అతడి విషయంలో కెప్టెన్, కోచ్, సెలెక్టర్లదే పూర్తి బాధ్యత. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ లేకుండా అతడిని ఆడించాలనే నిర్ణయం ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు. సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌) ప్లేయర్లను ఎంపిక చేయదు కదా! ఆటగాడి పరిస్థితి ఎలా ఉంది, ఏ మ్యాచ్‌లు ఆడగలడు, శరీర పరిస్థితి ఎలా ఉందన్న సమాచారాన్ని మాత్రమే వారు అందిస్తారు. నిర్ణయం మాత్రం కెప్టెన్‌, కోచ్‌, సెలెక్టర్లు తీసుకుంటారు. సీఓఈ కేవలం సమాచారాన్ని అందిస్తుంది’ అని బద్రీనాథ్‌ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

భారత్-జపాన్ మధ్య చారిత్రక టీ20 మ్యాచ్.. ఎప్పుడంటే?

అభిషేక్ శర్మ కాదు.. సంజు-వైభవ్‌ జోడీని ఓపెనింగ్‌కు పంపాలి: దీప్ దాస్‌గుప్తా

Updated Date - Sep 05 , 2026 | 08:20 AM