భారత్-జపాన్ మధ్య చారిత్రక టీ20 మ్యాచ్.. ఎప్పుడంటే?
ABN , Publish Date - Sep 04 , 2026 | 07:29 PM
భారత క్రికెట్ జట్టు ఓ చారిత్రక పోరుకు సిద్ధమవుతోంది. జపాన్, భారత దేశాల మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాలకు గుర్తుగా టీమిండియా సెప్టెంబర్ 22న ఆ దేశంతో స్పెషల్ టీ20 మ్యాచ్ ఆడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ జట్టు ఓ చారిత్రక పోరుకు సిద్ధమవుతోంది. జపాన్, భారత దేశాల మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాలకు గుర్తుగా టీమిండియా సెప్టెంబర్ 22న ఆ దేశంతో స్పెషల్ టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. జపాన్‌లోని టోచిగిలో ఉన్న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ చారిత్రక మ్యాచ్ ‘సుజుకి కప్’ పేరుతో నిర్వహించనున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయె తకాయిచి మధ్య జరిగిన భేటీలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఇరు దేశాల్లోని క్రీడా సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఇరు దేశాల మధ్య ప్రజల పరస్పర సంబంధాలను పెంచే లక్ష్యంతో ‘స్పోర్ట్ 75’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగానే టీమిండియా-జపాన్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ నెలలోనే జపాన్ వేదికగా ఆసియా గేమ్స్ కూడా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే భారత క్రికెట్ పురుషుల జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్‌లో ఆడనుండగా, జపాన్ లీగ్ స్టేజీలో తలపడనుంది.
ఇది కీలక ఘట్టం: బీసీసీఐ
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ విషయం గురించి మాట్లాడారు. జపాన్‌తో చారిత్రక టీ20లో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు. ‘భారత్, జపాన్ జట్లు ప్రత్యేక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో తలపడటం కీలక ఘట్టం. క్రికెట్ భారత జట్టును ఓ కొత్త ప్రాంతానికి తీసుకెళ్లడంతో పాటు జపాన్, తూర్పు ఆసియాలోని మరింత మంది ప్రేక్షకులకు క్రికెట్‌ను పరిచయం చేసే అవకాశం ఇది. భారత్, జపాన్ మధ్య సుదీర్ఘకాలంగా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాలకు గుర్తుగా నిర్వహించున్న వేడుకల్లో క్రికెట్ కూడా భాగం కావడం సంతోషంగా ఉంది‘ అని సైకియా వెల్లడించారు.
గర్వంగా ఉంది: జపాన్ క్రికెట్ సీఈవో
జపాన్ క్రికెట్ అసోసియేషన్ (JCA) సీఈవో నావోకీ మియాజీ కూడా ఈ మ్యాచ్‌పై ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ ఛాంపియన్ టీమిండియాను జపాన్‌లో ఆడించగలగడం తమకు చారిత్రక ఘట్టమని అన్నారు. ఈ మ్యాచ్ ద్వారా జపాన్‌లో క్రికెట్‌పై ఆసక్తి మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత క్రికెట్ అభిమానులు జపాన్‌కు వచ్చి మ్యాచ్‌ను ఆస్వాదించాలని కోరారు. దాంతోపాటు క్రికెట్ గురించి తెలుసుకోవాలనుకునే స్థానిక జపాన్ ప్రజలు కూడా తమ జట్టును ప్రోత్సహించేందుకు స్టేడియానికి రావాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి:
ముగ్గురు పిల్లలతో కలిసి.. లోయలోకి దూకి మహిళా రెజ్లర్ ఆత్మహత్య
కీలక భేటీకి అగార్కర్ గైర్హాజరు.. అసలు కారణాన్ని వెల్లడించిన బీసీసీఐ