ముగ్గురు పిల్లలతో కలిసి.. లోయలోకి దూకి మహిళా రెజ్లర్ ఆత్మహత్య
ABN , Publish Date - Sep 04 , 2026 | 04:43 PM
మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ అశ్వినీ మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ అశ్వినీ మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో అశ్విని సహా ఇద్దరు పిల్లలు మృతి చెందగా, ఆమె మరో కూతురు తీవ్ర గాయాలతో బయటపడి చికిత్స పొందుతోంది. కుటుంబ కలహాలు, భర్త, అత్తమామల వేధింపులే ఆత్మహత్యకు కారణమని అశ్విని తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై నల్దుర్గ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, అశ్వినీ మనోహర్ పాల్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రెజ్లర్. శుక్రవారం ధారాశివ్ జిల్లాలోని చారిత్రాత్మక నల్దుర్గ్ కోటపై నుంచి ముగ్గురు పిల్లలతో కలిసి వంద అడుగుల లోతైన లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో అశ్విన్ పాల్, ఆమె ఐదున్నరేళ్ల కుమారుడు అజింక్య అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె రెండున్నరేళ్ల కవల కుమార్తెల్లో ఒకరైన క్రాంతి చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో కుమార్తె వీరా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
‘మహారాష్ట్ర ఆడపులి’గా గుర్తింపు
అశ్విని మనోహర్ పాల్ జాతీయ స్థాయి రెజ్లింగ్‌లో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. ఆమెను అభిమానులు ‘మహారాష్ట్ర ఆడపులి’గా పిలుచుకునేవారు. ఆమె తన రెజ్లింగ్ కెరీర్‌లో జాతీయ స్థాయిలో ఐదు స్వర్ణ పతకాలు, ఆరు రజత పతకాలు సాధించడం విశేషం.
ఇవి కూడా చదవండి:
ఆ రికార్డు బ్రేక్ చేస్తానని ఊహించలేదు: స్మృతి మంధాన
సచిన్ లాంటి గొప్ప కెరీర్‌ను వైభవ్ నిర్మించుకోవాలి: బీసీసీఐ