కీలక భేటీకి అగార్కర్ గైర్హాజరు.. అసలు కారణాన్ని వెల్లడించిన బీసీసీఐ
ABN , Publish Date - Sep 04 , 2026 | 02:41 PM
భారత క్రికెట్‌లో కీలక పరిణామాలపై చర్చించేందుకు గురువారం బీసీసీఐ నిర్వహించిన కీలక భేటీకి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గైర్హాజరైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా క్లారిటీ ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌లో కీలక పరిణామాలపై చర్చించేందుకు గురువారం బీసీసీఐ నిర్వహించిన కీలక భేటీకి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గైర్హాజరైన సంగతి తెలిసిందే. దీంతో అతడి భవితవ్యంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అగార్కర్ కాంట్రాక్ట్ వచ్చే ఏడాది జులైతో ముగియనుండటంతో.. అతడి స్థానంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కీలక సమావేశానికి అగార్కర్ హాజరుకాకపోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా క్లారిటీ ఇచ్చారు.
‘సమావేశం చాలా తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అజిత్ అగార్కర్ ప్రస్తుతం ముంబైలో లేరు. ఆయన సమావేశం జరిగిన సమయంలో ఆన్‌లైన్‌లో కూడా పాల్గొనలేని ప్రాంతంలో ఉన్నారు. మా వంతు ప్రయత్నం చేసినప్పటికీ అగార్కర్‌ను సమావేశంలోకి తీసుకురాలేకపోయాం. సోషల్ మీడియాలో ఊహాగానాలు ప్రచారం చేసేవారికి నేను మరింత సమాచారం ఇవ్వాలని అనుకోవడం లేదు’ అని సైకియా వెల్లడించారు.
రోహిత్ శర్మతో విభేదాలు?
ఇటీవల భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై బీసీసీఐ పెద్దలకు, అగార్కర్-గంభీర్ ద్వయానికి మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. రానున్న 2027 వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మను కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోందని, అగార్కర్, గంభీర్ మాత్రం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే అగార్కర్ కీలక సమావేశానికి హాజరు కాకపోవడంతో రూమర్లు మరింత ఊపందుకున్నాయి. అయితే గురువారం జరిగిన సమావేశంలో ఎలాంటి సెలెక్షన్ అంశంపై చర్చ జరగలేదని సైకియా స్పష్టం చేశారు.
అగార్కర్‌కు ఢోకా లేనట్టే!
ప్రస్తుతానికి అగార్కర్ పదవికి ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. అతడి కాంట్రాక్ట్ వచ్చే ఏడాది జులై వరకు కొనసాగనుంది. ప్రపంచకప్ అక్టోబర్–నవంబర్‌లో జరగనున్న నేపథ్యంలో.. అవసరమైతే అగార్కర్ పదవీకాలాన్ని మరింత పొడిగించే అవకాశమూ ఉందని సమాచారం. అగార్కర్ చివరిసారిగా శ్రీలంకలో జరిగిన భారత జట్టు రెండో టెస్టు సందర్భంగా కనిపించారు. ఇక సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు అతడు హాజరయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
ఆ రికార్డు బ్రేక్ చేస్తానని ఊహించలేదు: స్మృతి మంధాన
సచిన్ లాంటి గొప్ప కెరీర్‌ను వైభవ్ నిర్మించుకోవాలి: బీసీసీఐ