Share News

వన్డేల్లో విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాటర్: గ్లెన్ మ్యాక్స్‌వెల్

ABN , Publish Date - Sep 05 , 2026 | 06:55 AM

వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్ ఎవరు? అనే ప్రశ్నకు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒక్క మాటలో సమాధానం ఇచ్చేశాడు. భారత దిగ్గజం విరాట్ కోహ్లీనే వన్డే ఫార్మాట్‌లో తాను చూసిన అత్యుత్తమ ఆటగాడని స్పష్టం చేశాడు.

వన్డేల్లో విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాటర్: గ్లెన్ మ్యాక్స్‌వెల్
Glenn Maxwell

ఇంటర్నెట్ డెస్క్: వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్ ఎవరు? అనే ప్రశ్నకు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒక్క మాటలో సమాధానం ఇచ్చేశాడు. భారత దిగ్గజం విరాట్ కోహ్లీనే వన్డే ఫార్మాట్‌లో తాను చూసిన అత్యుత్తమ ఆటగాడని స్పష్టం చేశాడు. కోహ్లీ బ్యాటింగ్ తీరు వేరే లెవల్‌లో ఉంటుందని ప్రశంసలు కురిపించాడు. తాజాగా మ్యాక్స్‌వెల్ ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని మూడు ఫార్మాట్లలో తన ఆల్‌టైమ్ బెస్ట్ ప్లేయర్లను ఎంపిక చేశాడు.


‘వన్డే ఫార్మాట్‌లో నేను చూసిన అత్యుత్తమ ప్లేయర్ కోహ్లీ. మాపై అతడు ఆడిన కొన్ని ఇన్నింగ్స్‌లు అద్భుతం. కోహ్లీకి బంతిని ఆడేందుకు ఎక్కువ సమయం ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఫీల్డ్‌లో ఎక్కడికి కావాలంటే అక్కడిని బంతిని బాదేయగలడు. ఈ స్కిల్ అందరికీ ఉండదు. కోహ్లీ వేరే లెవల్ అంతే!’ అని మ్యాక్సీ వెల్లడించాడు. ఇదిలా ఉంటే, కోహ్లీ, మ్యాక్స్‌వెల్ ఇద్దరూ ఆర్సీబీ తరఫున కూడా ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.


టీ20ల్లో రస్సెల్..

టీ20 ఫార్మాట్‌లో వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ రస్సెల్‌ను మ్యాక్స్‌వెల్ తన ఆల్‌టైమ్ బెస్ట్‌గా ఎంచుకున్నాడు. ‘పొట్టి ఫార్మాట్‌లో రస్సెల్‌ను మించిన వారిని ఎంచుకోవడం కష్టం. అతడి పవర్ అద్భుతం. బంతిని చాలా బలంగా, చాలా దూరంగా బాదేస్తాడు. దానికి తోడు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు. రస్సెల్ నిజంగా పర్‌ఫెక్ట్ క్రికెటర్’ అని మ్యాక్సీ వివరించాడు. రస్సెల్‌ ఇప్పటివరకు 607 టీ20 మ్యాచ్‌ల్లో 9,919 పరుగులు చేశాడు. 166.70 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేసిన అతడు రెండు సెంచరీలు, 36 అర్ధసెంచరీలు నమోదు చేశాడు. బౌలింగ్‌లో 535 వికెట్లు పడగొట్టాడు.


టెస్టుల్లో స్టీవ్‌ స్మిత్‌!

టెస్టు క్రికెట్‌లో తన ఆల్‌టైమ్ బెస్ట్‌గా ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌ను మ్యాక్సీ ఎంచుకున్నాడు. ‘2017లో మా జట్టు భారత పర్యటనకు వెళ్లింది. తుది జట్టులో నాకూ అవకాశం దక్కింది. అక్కడ స్మిత్ సెంచరీలతోనే డీల్ చేస్తున్నాడు. మరో ప్రపంచంలో బ్యాటింగ్ చేస్తున్నట్లు అనిపించింది. భారత్‌పై అప్పుడు మూడు సెంచరీలు చేసినట్టున్నాడు. అతడి బ్యాటింగ్‌కు ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావించాను’ అని మ్యాక్స్‌వెల్ తెలిపాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. 125 మ్యాచ్‌ల్లో 223 ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు 10,920 పరుగులు సాధించాడు. ఇందులో 37 సెంచరీలు, 45 అర్ధసెంచరీలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

భారత్-జపాన్ మధ్య చారిత్రక టీ20 మ్యాచ్.. ఎప్పుడంటే?

అభిషేక్ శర్మ కాదు.. సంజు-వైభవ్‌ జోడీని ఓపెనింగ్‌కు పంపాలి: దీప్ దాస్‌గుప్తా

Updated Date - Sep 05 , 2026 | 07:18 AM