Share News

చైనా మాస్టర్స్: సెమీస్‌కు దూసుకెళ్లిన సాత్విక్-చిరాగ్ జోడీ

ABN , Publish Date - Sep 04 , 2026 | 09:06 PM

చైనా మాస్టర్స్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్-చిరాగ్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్‌లో డెన్మార్క్‌కు చెందిన జోడీపై విజయం సాధించారు.

చైనా మాస్టర్స్: సెమీస్‌కు దూసుకెళ్లిన సాత్విక్-చిరాగ్ జోడీ
Satwik Chirag Shetty

ఇంటర్నెట్ డెస్క్: చైనా మాస్టర్స్ టోర్నీలో భారత స్టార్ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ శెట్టి అదరగొడుతున్నారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో డెన్మార్క్‌కు చెందిన కిమ్ ఆస్ట్రప్-ఆండర్స్ స్కారప్ జోడీపై హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించారు. దీంతో సాత్విక్-చిరాగ్ జోడీ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన సాత్విక్‌-చిరాగ్‌ జోడీ 70 నిమిషాల పాటు సాగిన ఉత్కంఠభరిత పోరులో 21-13, 16-21, 21-18తో డెన్మార్క్‌ జంటను ఓడించింది.


సాత్విక్‌-చిరాగ్‌ తొలి గేమ్‌ను అదిరిపోయే ఆరంభంతో మొదలుపెట్టారు. 5-1తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత జోడీ.. వరుసగా షాట్లు కొడుతూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచింది. 16-9తో ఏకంగా ఏడు పాయింట్ల ఆధిక్యం సాధించి.. చివరకు తొలి గేమ్‌ను 21-13తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో డెన్మార్క్ జోడీ ఆస్ట్రప్‌-స్కారప్ పుంజుకున్నారు. భారత జోడీకి దీటుగా పాయింట్లు సాధిస్తూ పోటీని హోరాహోరీగా మార్చారు. 15-15తో స్కోరు సమంగా ఉన్న సమయంలో డెన్మార్క్‌ జోడీ వరుసగా ఆరు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో రెండో గేమ్‌ను కోల్పోయిన సాత్విక్‌-చిరాగ్‌.. నిర్ణయాత్మక మూడో గేమ్‌ ఆడాల్సి వచ్చింది. మూడో గేమ్‌లో ఇరు జట్లూ ఒక్క పాయింట్‌ కోసం తీవ్రంగా పోరాడాయి. 17-17తో స్కోరు సమం కావడంతో మ్యాచ్‌ మరింత ఉత్కంఠగా మారింది. ఈ సమయంలో సాత్విక్‌-చిరాగ్‌ వరుసగా మూడు కీలక పాయింట్లు సాధించి 20-17తో మ్యాచ్‌పై పట్టు సాధించారు. ప్రత్యర్థులు మరో పాయింట్‌ సాధించినప్పటికీ.. భారత జోడీ ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా తర్వాతి పాయింట్‌ను గెలుచుకుని మ్యాచ్‌ను ముగించింది. దీంతో సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.


కిదాంబి శ్రీకాంత్‌ ఔట్

పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ కిదాంబి శ్రీకాంత్‌ పోరాటం క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. హాంకాంగ్‌కు చెందిన లీ చెక్‌ యూయి చేతిలో వరుస గేమ్‌లలో ఓటమి పాలయ్యాడు. 25వ ర్యాంకర్‌ లీ చెక్‌ 39 నిమిషాల్లో శ్రీకాంత్‌ను 21-16, 21-16తో ఓడించాడు. తొలి గేమ్‌లో 3-0తో శ్రీకాంత్‌ ఆధిక్యంలోకి వచ్చినప్పటికీ.. లీ చెక్‌ వెంటనే పుంజుకుని 3-3తో స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత వరుసగా ఆరు పాయింట్లు సాధించి 14-6తో ఆధిక్యంలోకి వెళ్లాడు. శ్రీకాంత్‌ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నించినా.. లీ చెక్‌ తొలి గేమ్‌ను చేజిక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్‌ మరోసారి 4-0తో శుభారంభం చేశాడు. అయితే లీ చెక్‌ 4-4తో స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత ఇరువురు పాయింట్‌ కోసం హోరాహోరీగా తలపడ్డారు. 15-15 వరకు పోరు నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. అయితే కీలక దశలో లీ చెక్‌ మరోసారి దూకుడు పెంచాడు. వరుసగా మూడు పాయింట్లు సాధించి 18-15తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత మరో మూడు పాయింట్లతో మ్యాచ్‌ను ముగించి సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టాడు.


ఇవి కూడా చదవండి:

భారత్-జపాన్ మధ్య చారిత్రక టీ20 మ్యాచ్.. ఎప్పుడంటే?

అభిషేక్ శర్మ కాదు.. సంజు-వైభవ్‌ జోడీని ఓపెనింగ్‌కు పంపాలి: దీప్ దాస్‌గుప్తా

Updated Date - Sep 04 , 2026 | 09:07 PM