140కేజీల పవర్‌లిఫ్ట్‌తో వైరల్.. యువ సంచలనానికి ఆన్‌లైన్ వేధింపులు!
ABN , Publish Date - Sep 04 , 2026 | 08:21 PM
తన సంచలన ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న భారత యువ పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు ఎదురయ్యాయి. ఐపీఎఫ్ ప్రపంచ సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో కేయా రజతం సాధించిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: తన సంచలన ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న భారత యువ పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు ఎదురయ్యాయి. ఐపీఎఫ్ ప్రపంచ సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో కేయా రజతం సాధించిన సంగతి తెలిసిందే. కేవలం 21 ఏళ్ల వయసులో తన శరీర బరువుకు మూడు రెట్లకుపైగా అయిన 140 కేజీల బరువును డెడ్‌లిఫ్ట్‌లో ఎత్తి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ విజయంతో వచ్చిన పాపులారిటీ ఆమెకు చేదు అనుభవాలను మిగుల్చిందని కేయా ఇన్‌స్టా వేదికగా తెలిపింది. సోషల్ మీడియాలో తనపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, తన పేరుతో నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారని కేయా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాలో సుదీర్ఘమైన పోస్టు చేసింది.
‘హాయ్.. నేను చేసిన ఈ పోస్టును చదివేందుకు ఆగినందుకు కృతజ్ఞతలు. ఐపీఎఫ్ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించాను. నా కష్టాన్ని గుర్తించి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అయితే ఓ భారత మహిళా అథ్లెట్‌గా ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తోంది. నా పేరుతో నకిలీ ఖాతాలు పుట్టుకొచ్చాయి. నా జాతి, వంశం, కులం గురించి అసహ్యకరమైన చర్చలు జరుగుతున్నాయి. ఆ చెత్త సంభాషణలు నన్ను ఇప్పటికీ కలవరపరుస్తున్నాయి. అన్నింటికంటే దారుణంగా నా ముఖం, శరీరాన్ని ఉపయోగించి వేలాది ఏఐ చిత్రాలను రూపొందిస్తున్నారు.
నేను మొదటి నుంచే సోషల్ మీడియాలో వ్యక్తిగత ఖాతాల నుంచి ఫొటోలు షేర్ చేయను. నా పాత ఇన్‌స్టా ఖాతాలో కేవలం 300 ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడది సస్పెండ్ కావడంతో కొత్త ఖాతాను ఓపెన్ చేసి ఈ పోస్ట్ చేస్తున్నా. ఇది కూడా నేను ఎప్పుడూ పబ్లిక్‌గా ఉంచాలని అనుకోవడం లేదు. కానీ మళ్లీ ఇది కూడా సస్పెండ్ కాకుండా ఉండేందుకే నా పక్షాన నేను నిలబడేందుకు నాకు వేరే మార్గం కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు ఈ విషయాలను వెల్లడించా. పవర్ లిఫ్టింగ్ నన్ను నేను సవాలు చేసుకునే ఒక సరదా ప్రయాణం. ఇంతటి స్థాయిలో పోటీపడే అవకాశం లభించడం పట్ల తాను ఎంతో కృతజ్ఞతతో ఉన్నా. అయితే నా అనుమతి లేకుండా రూపొందించిన ఏఐ చిత్రాలు పదేపదే సోషల్ మీడియాలో కనిపించడం తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోంది’ అని కేయా తన పోస్టులో వివరించింది.
ఇవి కూడా చదవండి:
భారత్-జపాన్ మధ్య చారిత్రక టీ20 మ్యాచ్.. ఎప్పుడంటే?
అభిషేక్ శర్మ కాదు.. సంజు-వైభవ్ జోడీని ఓపెనింగ్‌కు పంపాలి: దీప్ దాస్‌గుప్తా