Share News

ఇందిరమ్మ ఇళ్లు దక్కేదెవరికో?

ABN , Publish Date - Aug 29 , 2026 | 09:59 AM

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న వారికి కాంగ్రెస్‌ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

ఇందిరమ్మ ఇళ్లు దక్కేదెవరికో?
Indiramma Housing Lottery

  • నియోజకవర్గంలో 480 ఎల్‌ఐజీ ఫ్లాట్స్‌కు 5,976 మంది అర్హులు

  • ఒక్కో ఫ్లాట్‌కు సుమారు 13మంది ఆశావాహులు ఎదురుచూపు

  • నేడు కేపీహెచ్‌బీ ఫంక్షన్‌హాల్లో డ్రా ద్వారా లబ్ధిదారుల ఎంపిక

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న వారికి కాంగ్రెస్‌ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆశావాహులు ఆగస్టు 15 వరకు దరఖాస్తులు చేసుకున్నారు. క్యూర్‌ పరిధిలో అత్యధికంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలోనే 9,208 దరఖాస్తులు రాగా.. అందులో నుంచి 360 డిగ్రీ యాప్‌ ద్వారా కొన్నింటిని తొలగించి ఫైనల్‌ జాబితా ఈనెల 25న 5,976 మంది అర్హులని ప్రకటించారు. అందులో నుంచే ఈనెల 29న (శనివారం) ఉదయం 11 గంటల నుంచి డ్రా ద్వారా 480 కుటుంబాలను ఎంపిక చేయనున్నారు.


కూకట్‌పల్లిలోనే సీఎం శంకుస్థాపన..

క్యూర్‌ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. తొలి దశగా ఒక్కో నియోజకవర్గంలో 480 ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈనెల 13న ఇందిరమ్మ టవర్స్‌కు కూకట్‌పల్లి నియోజకవర్గం కేపీహెచ్‌బీలోని హౌసింగ్‌బోర్డు స్థలంలో సీఎం శంకుస్థాపన చేశారు. నగరంలో మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ నిర్మించే ఇందిరమ్మ టవర్స్‌ స్థలం అత్యంత ఖరీదైనదిగా చెప్పవచ్చు. ఇక్కడ నిర్మించే ఒక్కో ఫ్లాట్‌ ధర రూ.50లక్షల వరకు ఉంటుందని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఇందులో లబ్ధిదారుని వాటా కింద రూ.6లక్షలు చెల్లించాల్సి ఉండగా.. రూ.5లక్షలు ప్రభుత్వం రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల్లో నిర్మాణానికి ఇస్తున్నట్టు ఇక్కడ కూడా ఇస్తామని ప్రకటించారు.


దీంతో హైటెక్‌సిటీ ప్రాంతానికి చేరువలో ఉన్న కేపీహెచ్‌బీలో ఇందిరమ్మ టవర్స్‌కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇక్కడ నాలుగు టవర్లు నిర్మించనున్నారు. ఒక్కో టవర్‌ జీ ప్లస్‌ 10 అంతస్తులతో 120 ఫ్లాట్స్‌ చొప్పున మొత్తం 480 నిర్మిస్తున్నారు. స్కూట్నీకి ముందు ఒక్కో ఫ్లాట్‌కు దరఖాస్తులు 19మంది పడగా.. వడపోత అనంతరం ఒక్కో ఫ్లాట్‌కు సుమారు 13మంది ఆశావాహులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఒక్కో ఫ్లాట్‌ 528 ఎస్‌ఎ్‌ఫటీతో సింగిల్‌ బెడ్రూం నిర్మించి లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఇంత చిన్న మొత్తంలో ఇళ్లు నిర్మించే బిల్డర్స్‌ లేరు. అన్ని అనుమతులతో ఇలాంటి ఇల్లు కొందామనుకున్నా అందుబాటులో లేవు. రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్‌బోర్డు ద్వారా ఇందిరమ్మ పేరుతో నిర్మిస్తున్న ఎల్‌ఐజీ టవర్స్‌ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.


city5.2.jpgగత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌బెడ్రూం ఇళ్లు నిర్మించిన తర్వాత ఆన్‌లైన్‌లో లాటరీ ద్వారా ఎంపిక చేయగా.. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం నిర్మాణ పనులు ప్రారంభం కాక ముందే లబ్ధిదారులను డ్రా ద్వారా ఎంపిక చేస్తోంది. దీని ద్వారా విద్య, ఉద్యోగం, ఉపాధికి ఇబ్బంది పడకుండా ఎక్కడ నివాసం ఉంటున్నారో అదే ప్రాంతంలో సొంత ఇల్లు నిర్మించి ఇస్తున్నామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగా కేపీహెచ్‌బీలో గజం రూ.1.5-2.25లక్షలు పలికే ప్రాంతంలో ఉచితంగా స్థలం రిజిస్ర్టేషన్‌ చేసి ఇవ్వనుంది. దీంతో ఇక్కడ డ్రాలో ఫ్లాట్‌ వస్తే ఎంతో అదృష్టవంతులు అని చెప్పవచ్చు. 29న సాయంత్రం 5 గంటలలోపే ఫలితం తెలిసిపోతుంది.


ఒకవేళ లేటు అయినా పూర్తిచేసి లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి బయటకు వెళ్తామని ఈఈ కిరణ్‌బాబు తెలిపారు. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ అర్హుల జాబితా ఎక్కువగా ఉందన్నారు. ఇక్కడ జరిగే ప్రక్రియ అంతా మీ ఫోన్‌లో కూడా చూసుకోవచ్చన్నారు. దశలవారీగా నిర్మించనున్న ఇళ్లల్లో మిగతా వారికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు. ప్రస్తుతం కేవలం పైలట్‌ ప్రాజెక్టు మాత్రమే అన్నారు. ఫ్లాట్‌ రాని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని తదుపరి ప్రాజెక్ట్‌లో వారికి కూడా ఇల్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందన్నారు.


పైరవీలకు తావులేదు..

లబ్ధిదారుల సమక్షంలోనే శనివారం డ్రా తీయనున్నారు. ఇందు కోసం కేపీహెచ్‌బీ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాట్లు చేశారు. డైనింగ్‌హాల్‌ పక్కనే ఉన్న పార్కింగ్‌ స్థలంలో కూడా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఉంటాయన్నారు. సీట్లు సరిపడా లేకపోతే ఇక్కడ జరిగే డ్రాను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆన్‌లైన్‌ లింక్‌ కూడా ఉందన్నారు. ఎవరైనా ఫ్లాట్‌ ఇప్పిస్తామని చెప్పినా నమ్మవద్దని, డ్రాలో ఎవరికి వస్తే వారే లబ్ధిదారు అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇక్కడ డ్రాలో ఏవైనా సందేహాలు ఉంటే హౌసింగ్‌బోర్డు కార్యాలయంలో సంప్రదించాలి అన్నారు. మధ్యవర్తులకు తావు లేదు. దరఖాస్తుదారుల నుంచే ఫైనల్‌ లిస్ట్‌ తయారు చేశాం. అన్ని నిబంధనలు పాటిస్తూ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుందని అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అడ్రస్‏లో లేరంటూ.. పేర్లు గల్లంతు!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 29 , 2026 | 09:59 AM