Share News

అడ్రస్‏లో లేరంటూ.. పేర్లు గల్లంతు!

ABN , Publish Date - Aug 29 , 2026 | 09:30 AM

ఓటర్‌ జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్‌)లో భాగంగా హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు చర్చనీయాంశంగా మారింది.

అడ్రస్‏లో లేరంటూ.. పేర్లు గల్లంతు!
Hyderabad Voter List Revision

  • ఆబ్సెంట్‌ 15.44 శాతం,డెత్‌ 8.06 శాతం

  • ఫారాలు ఇవ్వకుండానే ఏఎస్డీ జాబితాలో

  • అదే అడ్రస్‏లో ఉంటున్నా పేరు తొలగించారంటున్న పలువురు

  • ఇళ్లకు రాలేదు.. పరిశీలించలేదు

  • వార్డు సభల్లో అధికారుల దృష్టికి

  • ఏఎస్డీకి ప్రాతిపదిక ఏంటని ప్రశ్నలు

  • తొలగింపుపై కాలనీ సంఘాల అసంతృప్తి

హైదరాబాద్‌ సిటీ: ఓటర్‌ జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్‌)లో భాగంగా హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపు చర్చనీయాంశంగా మారింది. ముసాయిదా జాబితాలో చోటు దక్కని పేర్ల తొలగింపునకు చూపిన కారణాలు సహేతుకంగా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో 47.36 లక్షల ఓటర్లు ఉండగా, 19.41 లక్షల (41 శాతం) పేర్లు జాబితా నుంచి మాయమయ్యాయి. ఆబ్సెంట్‌, షిఫ్ట్‌ డెత్‌ (ఏఎస్డీ), డూప్లికేట్‌, ఇతరత్రా కారణాలు చూపుతూ పేర్లు తొలగించారు.


తొలగించిన ఓట్లలో 18.01 (92.8 శాతం) లక్షలు ఏఎ్‌సడీ కేటగిరీలోనివి కాగా, డూప్లికేట్‌, ఇతర ఓట్లు కేవలం ఏడుశాతం మాత్రమే ఉన్నాయి. ఏఎ్‌సడీలోని 18.01 లక్షల ఓట్లలో షిఫ్టెడ్‌గా చూపినవి 13.45 (69.30 శాతం) ఉండడం గమనార్హం. ఆబ్సెంట్‌ ఓట్లు 2.99 లక్షలు (15.44 శాతం), మరణించిన వారు 1.56 లక్షలు (8.06 శాతం) ఉన్నారు. ముసాయిదా జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై వేలాది మంది ఓటర్లు అభ్యంతరం తెలుపుతున్నారు. తాము అదే చిరునామాలో ఉంటున్నా ఏఎస్‏డీ జాబితాలో చేర్చి పేర్లు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


గురువారం నిర్వహించిన వార్డు సభల్లోనూ ఈ తరహా ఫిర్యాదులు అందాయి. ఎన్యుమరేషన్‌ ఫారం కూడా ఇవ్వకుండా తమ పేరు ఎలా తీసేస్తారని అధికారులను ప్రశ్నించారు. ‘నేను జీహెచ్‌ఎంసీ నుంచి మాట్లాడుతున్నా.. ఎన్యుమరేషన్‌ ఫారం తీసుకునేందుకు కమ్యూనిటీ హాల్‌కు రావాలని ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. నాకు రావడం కుదరదు. ఇంటికి వచ్చి ఇవ్వాలి కదా అని అడిగితే ఫోన్‌ కట్‌ చేశాడు. తీరా చూస్తే మా కుటుంబ సభ్యుల పేర్లు ముసాయిదా జాబితాలో లేవు. షిఫ్ట్‌ అయినట్టు చూపారు’ అని సికింద్రాబాద్‌ బౌద్ధనగర్‌కు చెందిన ఓ వ్యక్తి పేర్కొన్నారు. ఈ తరహా అభ్యంతరాలు, ఫిర్యాదులు అధికారుల దృష్టికి ఎక్కువగా వస్తున్నాయి.


ఫారం ఇవ్వకుండా ఏఎస్‏డీ జాబితాలో..

తొలగించిన ఓట్లలో 90 శాతానికిపైగా ఏఎస్డీ కేటగిరీలో ఉన్న నేపథ్యంలో ఏ ప్రాతిపదికన ఓటర్లను ఆ జాబితాలో చేర్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆబ్సెంట్‌, షిఫ్టెడ్‌ జాబితాలో ఎవరిని చేర్చాలన్న దానిపై బీఎల్‌ఓలకు పూర్తి అవగాహన లేదు. ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇవ్వాల్సిన బీఎల్‌ఓలు.. ఓ చోట కూర్చొని ఫోన్లు చేశారు. తమ వద్దకు వచ్చి ఫారం తీసుకెళ్లాలని సూచించారు. పనులు, ఇతరత్రా కారణాలతో కొందరు.. బీఎల్‌ఓలు వచ్చి ఇవ్వాలి కదా మనమెందుకు వెళ్లాలనే ఆలోచనతో ఇంకొందరు వారి వద్దకు వెళ్లలేదు.


city4.jpgఅదే చిరునామాలో ఉంటున్నప్పటికీ ఇలా ఫారం తీసుకోని వారిని ఏఎ్‌సడీ జాబితాలో చేర్చారు. పంపిణీతో సంబంధం లేకుండా అన్ని ఫారాలపై క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ఓటర్లకు పంపిణీ జరిగిందా? లేదా? అన్నది వారు పట్టించుకోలేదు. దీనిని అవకాశంగా మార్చుకున్న బీఎల్‌ఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇదే నగరంలో భారీ స్థాయిలో ఓట్ల తొలగింపునకు కారణమని పలు కాలనీ సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.


ఈ నియోజకవర్గాల్లో..

  • మలక్‌పేటలో 3.30 లక్షల ఓటర్లు ఉండగా, 1.47 లక్షల ఓట్లు తొలగించారు. ఇందులో షిఫ్టెడ్‌ (చిరునామా మారిన) ఓటర్లు 1.20 లక్షలు (81.43 శాతం), ఆబ్సెంట్‌ ఓటర్లు 3,718 (2.51 శాతం)గా చూపారు. మరణించిన వారు 10,472 (7.08 శాతం)గా చూపారు. ఇక్కడ 7,316 మంది డూప్లికేట్‌ ఓటర్లు ఉన్నట్టు గుర్తించారు.

  • జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని 4.06 లక్షల ఓటర్ల నుంచి 1.79 లక్షల పేర్లు ముసాయిదా జాబితాలో లేవు. తొలగించిన ఓటర్లలో చిరునామా మారినట్టు చూపిన వారు 1.48 లక్షలు (83 శాతం), ఆబ్‌సెంట్‌ ఓటర్లు 13500 (7.5 శాతం), మరణించిన వారు 8232 (4.58 శాతం) ఉన్నారు.


  • సనత్‌నగర్‌లో 2.54 లక్షల ఓటర్లు ఉండగా, 1.41 లక్షల మంది పేర్లు జాబితా నుంచి మాయమయ్యాయి. ఇందులో షిఫ్టెడ్‌ 94395 (83.18 శాతం), ఆబ్‌సెంట్‌ 10649 (9.33 శాతం), మరణించిన ఓటర్లు 4,172 (4.58 శాతం) ఉన్నట్టు చూపారు.

  • కంటోన్మెంట్‌లో 2.45 లక్షల ఓటర్లకు గాను 1.05 లక్షల పేర్లు గల్లంతయ్యాయి. 75,166 మంది ఓటర్లు షిఫ్టెడ్‌ (71.56 శాతం), 14,692 మంది (14 శాతం) ఆబ్సెంట్‌, 8,955 మంది (8.52 శాతం) మరణించినట్టు చూపారు. 5,597 మందిని డూప్లికేట్‌ ఓటర్లుగా పేర్కొన్నారు.

  • యాకుత్‌ఫురాలో 3.74 లక్షల ఓటర్లకుగాను 1.54 లక్షల మంది పేర్లు తొలగించారు. వీరిలో చిరునామా మారిన ఓటర్లు 1.03 లక్షలు (66.81 శాతం) ఆబ్‌సెంట్‌ 24694 (16 శాతం), 14566 మంది (9.39 శాతం) ఉన్నట్టు చూపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 29 , 2026 | 09:30 AM