Share News

సీఎన్‌జీ ధరలకు మళ్లీ రెక్కలు.. కిలోకు రూ.3.89 పెంపు..

ABN , Publish Date - Aug 29 , 2026 | 08:27 AM

దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో సీఎన్‌జీ ధరలు మరోసారి పెరిగాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి కిలో సీఎన్‌జీపై రూ.3.89 చొప్పున పెంచుతున్నట్లు నగర గ్యాస్ పంపిణీ సంస్థ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ప్రకటించింది.

సీఎన్‌జీ ధరలకు మళ్లీ రెక్కలు.. కిలోకు రూ.3.89 పెంపు..
Delhi CNG Price Hike

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో సీఎన్‌జీ (Compressed Natural Gas) ధరలు మరోసారి పెరిగాయి. ఈరోజు (శనివారం) ఉదయం 6 గంటల నుంచి కిలో సీఎన్‌జీపై రూ.3.89 చొప్పున పెంచుతున్నట్లు నగర గ్యాస్ పంపిణీ సంస్థ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) ప్రకటించింది. దీంతో ఢిల్లీలో ప్రస్తుతం కిలో సీఎన్‌జీ ధర రూ.86.98కి చేరుకుంది. అలాగే, నోయిడాలో రూ.95.59, ఘాజియాబాద్‌లో రూ.95.59, గురుగ్రామ్‌లో రూ.92.01, మీరట్‌లో రూ.95.47, ముజఫర్‌నగర్‌లో రూ.95.47, షామ్లీలో రూ.95.47కు ధరలు చేరుకున్నాయి.


పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో ఎల్‌ఎన్‌జీ ధరలు భారీగా పెరగడం తాజా ధరల పెంపునకు ప్రధాన కారణమని ఐజీఎల్ వెల్లడించింది. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన తర్వాత సీఎన్‌జీ ధరలు పెరగడం ఇది ఐదోసారి. మే 15 నుంచి ఇప్పటివరకు నాలుగు విడతల్లో ధరలు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వేలాది మంది సీఎన్‌జీ వాహనదారులపై అదనపు భారం పడనుంది. సీఎన్‌జీతో నడిచే ప్రైవేటు కార్లు, ట్యాక్సీలు, ఆటోలు, వాణిజ్య వాహనాల నిర్వహణ వ్యయం పెరగనుంది. దీంతో ఈ భారం చివరికి ప్రయాణికులపై పడనుంది.


అంతర్జాతీయంగా ఎల్‌ఎన్‌జీ ధరలు సంక్షోభానికి ముందు స్థాయితో పోలిస్తే దాదాపు రెట్టింపయ్యాయని ఐజీఎల్ తెలిపింది. సీఎన్‌జీ సరఫరాకు అవసరమైన సహజ వాయువులో గణనీయమైన భాగాన్ని దిగుమతి చేసుకున్న ఎల్‌ఎన్‌జీ ద్వారానే సమకూర్చుకుంటున్నామని పేర్కొంది. హోర్ముజ్ జలసంధి మీదుగా ఎల్‌ఎన్‌జీ కార్గో రవాణాకు అంతరాయం ఏర్పడటంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయని వివరించింది. అలాగే, శీతాకాలం సమీపిస్తుండటంతో యూరప్ దేశాలు సహజ వాయువు నిల్వలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పింది. దీంతో ఎల్‌ఎన్‌జీ ధరలకు రెక్కలొచ్చి సీఎన్‌జీ సరఫరా వ్యయం గణనీయంగా పెరిగిందని పేర్కొంది. ఈ కారణంగానే రేట్లు పెంచాల్సిన పరిస్థితి నెలకొందని ఐజీఎల్ వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి

తక్కువ స్పీడ్‌ బ్యాటరీ బైకులకు నో రూల్స్‌!

బిచ్చగత్తె ఇంట్లో 3.50 లక్షల నగదు!

Updated Date - Aug 29 , 2026 | 08:31 AM