బియ్యం కావాలా.. డబ్బులివ్వాలా?
ABN , Publish Date - Aug 29 , 2026 | 08:24 AM
పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఉచిత బియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోకుండా కొందరు డీలర్లు అడ్డుపడుతున్నారు.
పక్కదారి పడుతున్న ప్రజాపంపిణీ బియ్యం
మూడు నెలలకు సరిపడా రేషన్ ఒకేసారి సరఫరా
దీన్ని ఆసరాగా చేసుకుంటున్న అక్రమార్కులు
కిలోకి రూ.12 ఆశచూపుతున్న డీలర్లు, దళారులు
వాటిని అధిక రేటుపై మిల్లర్లు, హోటళ్లకు విక్రయం
గ్రేటర్ పరిధిలో 40 శాతం వరకు పక్కదారి
హైదరాబాద్ సిటీ: పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఉచిత బియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోకుండా కొందరు డీలర్లు అడ్డుపడుతున్నారు. పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ.. కొందరు డీలర్లు, దళారులు భారీ దందాకు తెరలేపారు. ఎల్‌నినో కారణంగా ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో.. ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించిన కోటాను ఒకేసారి పంపిణీ చేస్తోంది. దీంతో రేషన్ దుకాణాల వద్ద రద్దీ నెలకొంది.
దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు డీలర్లు.. లబ్ధిదారులతో ఈ-పాస్ యంత్రంలో బయోమెట్రిక్ (వేలిముద్రలు) వేయించుకుని, బియ్యం తూకం వేయకుండానే కిలోకి రూ.12-13 చొప్పున చేతిలో పెడుతున్నారు. బియ్యం బదులు డబ్బులు తీసుకెళ్లేలా డీలర్లు వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో, ముందుగానే నిర్ణీత పరిమాణంలో బియ్యాన్ని మూటగట్టి ఉంచుతున్నారు. బయోమెట్రిక్ వేసిన వెంటనే, ఆ సంచీ తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.
కాదంటే.. లబ్ధిదారులు తెచ్చిన సంచీలో పట్టవని చెబుతూ, పెద్ద సంచీ తెచ్చుకోవాలని పంపించేస్తున్నారు. ‘‘ఈ బియ్యం మీరేం తింటారు. బియ్యం బదులు నగదు తీసుకోండి’’అని ఆశచూపుతున్నారు. మరోవైపు రేషన్ దుకాణాల బయటే మాటువేస్తున్న కొందరు దళారులు.. లబ్ధిదారులతో మాటలు కలిపి, కిలో బియ్యానికి రూ.14-15 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని.. రైస్ మిల్లర్లకు, హోటళ్లకు కిలో రూ.18 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బస్తాల రూపంలో అయితే కిలోకి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు.
కిలోకు రూ.12 చొప్పున చెల్లింపు!
గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి నెలకు 39,75,0277 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతుండగా, ఇందులో 40 శాతం వరకు పక్కదారి పడుతోంది. నగరంలోని అంబర్‌పేట్, పటేల్‌నగర్, మెహిదీపట్నం, గోల్కొండ, లంగర్‌హౌజ్, ముషీరాబాద్, ఆసి్‌ఫనగర్, నాంపల్లి, చార్మినార్, బహదూర్‌పుర తదితర ప్రాంతాల్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది.
పౌర సరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టకపోవడం, కొందరు సిబ్బంది అక్రమార్కులతో చేతులు కలపడం వల్లే ఈ అక్రమ వ్యాపారం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా వర్ధిల్లుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి రేషన్ దుకాణాలపై నిఘా ఉంచి.. పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
Read Latest AP News And Telangana News And International News And Telugu News