ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ డీల్.. వెనెజువెలాతో ఒప్పందంపై ట్రంప్ ప్రకటన..
ABN , Publish Date - Aug 29 , 2026 | 07:34 AM
వెనెజువెలాతో ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద చమురు ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా వెనెజువెలాలోని 65 బిలియన్ బ్యారెళ్లకు పైగా నిర్ధారిత చమురు నిల్వలపై అమెరికాకు మెజారిటీ నియంత్రణ లభించనుందని ట్రంప్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలాతో ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద చమురు ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా వెనెజువెలాలోని 65 బిలియన్ బ్యారెళ్లకు పైగా నిర్ధారిత చమురు నిల్వలపై అమెరికాకు మెజారిటీ నియంత్రణ లభించనుందని ట్రంప్ తెలిపారు. ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్' ద్వారా ఈ ఒప్పందాన్ని ప్రకటించారు (Trump Venezuela Oil Deal).
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ ఈ ఒప్పందం కోసం పనిచేశారని ట్రంప్ పేర్కొన్నారు. ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యం ద్వారా ఈ ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందం వల్ల అమెరికా చమురు నిల్వలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా పన్ను చెల్లింపుదారులపై ఎలాంటి భారం లేకుండానే ఈ ఒప్పందం జరిగిందని ట్రంప్ చెప్పారు (Donald Trump Venezuela).
ఈ ఒప్పందంలో ఏయే చమురు క్షేత్రాలు ఉన్నాయి, అమెరికా నియంత్రణ ఏ రూపంలో ఉంటుంది, ఏ ప్రైవేట్ కంపెనీలు ఇందులో భాగస్వాములు అనే వివరాలను అమెరికా ప్రభుత్వం ఇంకా పూర్తిగా వెల్లడించలేదు (US Venezuela Oil Deal). ప్రపంచంలోనే అత్యధిక ముడి చమురు నిల్వలు కలిగిన దేశాల్లో వెనెజువెలా అగ్రస్థానంలో ఉంది. అక్కడ సుమారు 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచ మొత్తం చమురు నిల్వల్లో దాదాపు 17 శాతం. అయితే భారీ నిల్వలు ఉన్నప్పటికీ వెనెజువెలా చమురు ఉత్పత్తి సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. ఆ సామర్థ్యాన్ని అమెరికా గణనీయంగా పెంచనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన