చావుకి బతుక్కి మధ్య..!
ABN , Publish Date - Aug 29 , 2026 | 06:15 AM
ఉప్పొంగుతున్న వరద.. కళ్ల ముందే కొట్టుకుపోతున్న ఇళ్లు, మనుషులు.. నలువైపులా పోటెత్తుతున్న వరద.. ఏ క్షణంలో ముంచేస్తుందో తెలియదు.. క్షణక్షణం చావుకి, బతుక్కి మధ్య ఊగిసలాట...
హృదయ విదారక స్థితిలో నేపాల్ వరద బాధితులు
ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న తీరు
కళ్లముందే ఇళ్లు, మనుషులు, వాహనాలు కొట్టుకుపోవడంతో ఆవేదన
579కి చేరిన మృతుల సంఖ్య.. 2 వేల మంది వరకు గల్లంతు
8 వేల మంది బలగాలతో సహాయక చర్యలు
ఇంకా జాడలేని 320 మంది భారతీయులు,
వంద మంది భారత సంతతి వ్యక్తులు
త్రిశూలి జలవిద్యుత్ కేంద్రం సొరంగం నుంచి
350 మందిని కాపాడిన సహాయక బృందాలు
టిబెట్‌లో నీటితో నిండుతున్న మరో గ్లేసియర్ లేక్
ఏ క్షణమైనా మరో భారీ వరద ముప్పు
ఖాఠ్మండూ/న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఉప్పొంగుతున్న వరద.. కళ్ల ముందే కొట్టుకుపోతున్న ఇళ్లు, మనుషులు.. నలువైపులా పోటెత్తుతున్న వరద.. ఏ క్షణంలో ముంచేస్తుందో తెలియదు.. క్షణక్షణం చావుకి, బతుక్కి మధ్య ఊగిసలాట.. నేపాల్ వరదల్లో జనం అనుభవించిన వేదన ఇది. చాలా మంది ఇళ్లతో సహా కొట్టుకుపోతే.. ప్రాణాలతో బయటపడినవారు ఇళ్లు, వాహనాలు, వస్తువులు సర్వం కోల్పోయిన ఆవేదనతో కొట్టుమిట్టాడుతున్నారు. రోడ్లు, వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో.. కొండల్లో, అడవుల్లో చిక్కుకున్నవాళ్లు ఎవరినీ సంప్రదించలేక, తినడానికి తిండిలేక, తాగడానికి నీళ్లులేక, ఎత్తయిన ప్రాంతాల్లో ఆక్సిజన్ సరిగా అందక అల్లాడుతున్నారు. నేపాల్ వరద బాధితులు అనుభవించిన నరకం, పడుతున్న ఇబ్బందులు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఎటుచూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు గల్లంతు లెక్కలను, దొరికిన మృతదేహాలను బట్టి మృతుల లెక్కలను నేపాల్ ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ తమవారి ఆచూకీ లభించడం లేదంటూ ఇచ్చే అవకాశం లేని, ఇళ్లు, భవనాలు, కుటుంబాలతో సహా కొట్టుకుపోయిన వారి వివరాలపై ఆరా తీసేవారు లేరని.. దీనితో మృతుల సంఖ్య వేలల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 579కు పెరిగింది. మరో 1,400 మందికిపైగా ఆచూకీ లభించడం లేదని నేపాల్ విపత్తుల నిర్వహణ శాఖ శుక్రవారం ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న 4,451 మందిని రక్షించినట్టు తెలిపింది. 520 మంది విదేశీయులు, 127 మంది నేపాలీ యాత్రికులు, 86 మంది భద్రతా సిబ్బంది గల్లంతైనట్టు తెలిపింది. గల్లంతైన విదేశీయుల్లో 290 మంది వరకు భారతీయులతోపాటు అమెరికన్లు (65 మంది), మలేషియా (51), ఉక్రెయిన్ (53), బ్రిటన్ (33), ఆస్ట్రేలియా (35), కెనడా పర్యాటకులు (25) మంది ఉన్నట్టు వెల్లడించింది. మిగతా దేశాలకు చెందినవారూ మరికొందరు ఉన్నారని పేర్కొంది. ఇక త్రిశూలి జలవిద్యుత్ కేంద్రం సొరంగంలో చిక్కుకున్న 350 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. ఇంకా వంద మందికిపైగా లోపల ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు వరద మొదట ప్రభావం చూపించిన టిబెట్‌లోని గ్యిరోంగ్ ప్రాంతంలో ఐదుగురు మరణించారని.. 260 మంది విదేశీయులు సహా 558 మందికిపైగా గల్లంతయ్యారని చైనా అధికారులు వెల్లడించారు. అటు టిబెట్ నుంచి ఇటు నేపాల్‌లోని త్రిశూలి, రసువా, ధడింగ్, నువాకోట్ వరకు వరదల్లో కొట్టుకుపోయినవారి మృతదేహాలు భోటేకోషి, తర్వాత అది కలిసే నదుల వెంట వందల కిలోమీటర్ల దూరంలో లభిస్తున్నాయి. దీనితో ఏ మృతదేహం ఎవరిదో, ఏ ప్రాంతంలో ప్రమాదానికి గురైన వారితో గుర్తించడం కష్టంగా మారుతోంది. ప్రమాదం జరిగి మూడు రోజులు అవుతుండటంతో.. మృతదేహాలు గుర్తుపట్టరాని విధంగా మారిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్ జిల్లాలో నాలుగు, కుషీనగర్ జిల్లాలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయని.. అవి నేపాల్ నుంచి వచ్చి ఉండవచ్చని అధికారులు వెల్లడించారు.

320 మంది భారతీయులు గల్లంతు
నేపాల్ వరదల్లో ఆచూకీ లభించకుండా పోయిన భారతీయుల సంఖ్య పెరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి అందిన సమాచారం మేరకు విదేశాంగ శాఖ ఈ వివరాలను అప్‌డేట్ చేస్తోంది. శుక్రవారం సాయంత్రానికల్లా ఇంకా 320 మంది భారతీయులు, మరో 100 మంది భారత సంతతివారి ఆచూకీ లభించడం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ వెల్లడించారు. వరద ప్రాంతాల్లోని 21 మంది భారతీయులు సురక్షితంగా తిరుగు ప్రయాణమయ్యారని, త్రిశూలి ప్రాజెక్టు సొరంగం నుంచి 63 మంది భారతీయులను రక్షించారని తెలిపారు. టిబెట్ వైపు చిక్కుకున్న 400 మంది భారతీయుల్లో 153 మంది సురక్షితంగా నేపాల్‌లోకి వచ్చారన్నారు.
విదేశాల సాయం అవసరం లేదని..
అకస్మాత్తు వరదలతో ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం బృందాలను పంపేందుకు పలు దేశాలు సిద్ధమైనా తొలుత నేపాల్ తిరస్కరించింది. తమకు రెస్క్యూ బృందాల అవసరం లేదని, సహాయక చర్యల కోసం 8 వేల మంది ఆర్మీ, పోలీసు బలగాలను రంగంలోకి దింపామని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛెత్రి పేర్కొన్నారు. కానీ గల్లంతైన వారిలో పెద్ద సంఖ్యలో విదేశీయులు ఉండటం, వివిధ దేశాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో.. విదేశాల సహాయక బృందాలను అనుమతించాలని నిర్ణయించామని శుక్రవారం రాత్రి విదేశాంగ శాఖ అధికారులు ప్రకటించారు.
నేపాల్‌లో ఎన్‌ఆర్‌ఐ కుటుంబం గల్లంతు
కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన పార్వతీపురానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ కుటుంబం నేపాల్ వరదల్లో గల్లంతయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పార్వతీపురం పట్టణానికి చెందిన సంతో్‌షకుమార్ సాహు (47).. 20 ఏళ్ల క్రితం లండన్‌కు వెళ్లి స్థిరపడ్డారు. ఇటీవల మానస సరోవర యాత్రకు వచ్చిన ఆయన కుటుంబం (సాహు, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు) ఓ వంతెన వద్ద ఉండగా.. పైనుంచి వరద వచ్చి నలుగురూ కొట్టుకుని పోయినట్టు సమాచారం అందిందని బంధువులు తెలిపారు. ఇదిలా ఉండగా, నేపాల్ వరదల్లో చిక్కుకుని అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన 21 మంది తమిళనాడు వాసులు శుక్రవారం రాత్రి చెన్నై చేరుకున్నారు. తమిళనాడు నుంచి మొత్తం 106 మంది మానస సరోవర్ యాత్రకు వెళ్లగా, అందులో 21 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. మిగిలిన 85 మంది గల్లంతయినట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.
యూపీ, బిహార్‌లలోని నదుల్లో పెరుగుతున్న వరద
నేపాల్‌లోని భోలేకోషి, నారాయణి, మరికొన్ని నదుల నీళ్లు దిగువకు ప్రవహించి గంగ, గండక్, కోసి, బుర్హిగండక్ నదుల్లో కలుస్తాయి. నేపాల్ వరదలు, భారీ వర్షాల నేపథ్యంలో నేపథ్యంలో యూపీ, బిహార్‌లలో ఈ నదుల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా నేపాల్‌తో సరిహద్దుల్లో ఉన్న బిహార్ జిల్లాలు భాగల్‌పూర్, పూర్ణియా, కథియార్, ఖగారియా, దిఘా, గోపాల్ గంజ్ తదితర ప్రాంతాల్లో పలుచోట్ల నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరాయి. దీనితో గండక్ నదిపై వల్మీకినగర్ వద్ద ఉన్న బ్యారేజీ గేట్లు మొత్తం ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నది వెంట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఏ క్షణమైనా మరో భారీ వరద
హిమాలయాల్లో వేల అడుగుల ఎత్తున మంచు కరుగుతూ, కొండల మధ్య సరస్సులా ఏర్పడి.. అది నిండినకొద్దీ దిగువకు నీరు వస్తూ ఉంటుంది. ఆ నీళ్ల పాయలు కలిసి నదులుగా దిగువకు ప్రవహిస్తుంటాయి. అలా టిబెట్‌లో భోటేకోషి నదీ వ్యవస్థ ప్రారంభమయ్యే చోట మంచు కొండలు విరిగి దిగువన ఉన్న సరస్సుకు అడ్డుగా కట్టలా పడ్డాయి. ఆ మంచు కరగడం, అదే సమయంలో భారీ వర్షంతో సరస్సులో భారీగా నీరు చేరింది. ఆ ఒత్తిడికి కట్ట తెగిపోయి.. నీరంతా ఒక్కసారిగా దిగువకు పోటెత్తి విలయం సృష్టించింది. ఇప్పుడు అదే ప్రాంతంలో మరో సరస్సుకు కూడా అడ్డుకట్టపడి 30 లక్షల ఘనపు మీటర్లకుపైగా నీరు చేరిందని, ఇప్పటికే దాని నుంచి నీళ్లు, బురద వెలువడుతున్నాయని చైనా గుర్తించింది. ఏ క్షణమైనా అడ్డుకట్ట తెగిపోయి.. భారీ వరద ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు టిబెట్‌లో సహాయక చర్యలను నిలిపివేసి, అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. దిగువన ఉన్న నేపాల్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నా.. ఏ క్షణమైనా వరద ముంచెత్తవచ్చని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సదా సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు