టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..
ABN , Publish Date - Aug 28 , 2026 | 02:59 PM
టాక్సిక్ మూవీలో మహిళలను కించపరిచేలా చూపించారంటూ తమిళనాడు నేత, ‘వీ ద లీడర్స్’ వ్యవస్థాపకుడు అన్నామలై విమర్శలు ఎక్కుపెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: యశ్ హీరోగా వచ్చిన టాక్సిక్ మూవీ తొలి రోజున బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు రాబట్టింది. అయితే, సినిమాలో మహిళలను కించపరిచేలా చూపించారంటూ తమిళనాడు నేత, ‘వీ ద లీడర్స్’ వ్యవస్థాపకుడు అన్నామలై విమర్శలు ఎక్కుపెట్టారు. సినిమాలో స్త్రీద్వేష ధోరణులు ఉన్నాయని విమర్శించారు. మహిళను ఒక వస్తువుగా చూపించారని మండిపడ్డారు. మహిళ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాలకు ఇలాంటి మూవీలు సవాలుగా మారతాయని వ్యాఖ్యానించారు. మూవీకి సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ అనుమతులు ఇవ్వడంపై కూడా అన్నామలై అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘నిబంధనలు మరింత కఠినతరం చేయాలి. మూవీలో ఏ సీన్స్‌ను అనుమతించాలనే విషయంలో సెన్సార్ బోర్డు కఠినంగా ఉండాలి. ప్రముఖ నటీనటులు ఉన్న సినిమాల విషయంలోనూ పక్కాగా వ్యవహరించాలి’ అని అన్నారు.
సినిమా సక్సెస్ దిశగా దూసుకుపోవడంపై కూడా అన్నామలై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచే విధంగా ఉన్న చిత్రాలను చిన్నారులు చూస్తే తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు.
‘ఆ మూవీ మొదటి రోజునే రూ.104 కోట్ల కలక్షన్లు సాధించింది. మహిళల్ని ఇలా చూపించే సినిమాలను చిన్నారులు తరచూ చూస్తే రేపు మన సమాజంలో మహిళల పరిస్థితి ఏమవుతుంది?’ అని ప్రశ్నించారు. మహిళత సమస్యల కోసం పరిష్కారం జరుగుతున్న ప్రయత్నాలు ఇలాంటి సినిమాలతో వృథాగా మారే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు.
మరోవైపు, మూవీ హీరో యశ్ మాత్రం టాక్సిక్‌ను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ‘ఏ పరిస్థితినైనా ప్రతి మహిళ దీటుగా ఎదుర్కోగలదని మూవీ డైరెక్టర్ నిరూపిస్తారు’ అంటూ టాక్సిక్ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌కు మద్దతుగా నిలిచారు.
ఈ వార్తలనూ చదవండి:
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం... మద్యం కొనుగోలుకు డిజిటల్ టచ్!