తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం... మద్యం కొనుగోలుకు డిజిటల్ టచ్!
ABN , Publish Date - Aug 28 , 2026 | 01:09 PM
తమిళనాడు ప్రభుత్వం మద్యం విక్రయాలపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిటైల్ మద్యం దుకాణాల స్టాక్ ఇండెంట్ ప్రక్రియను డిజిటలైజ్ చేయనుంది.
చెన్నై, ఆగస్టు 28: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తనదైన పాలనతో విజయ్ ప్రజల్లోకి దూసుకెళ్తున్నాడు. విద్య, వైద్యం, పరిశ్రమల విషయంలో ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న విజయ్ సర్కార్.. మద్యం షాపుల విషయంలో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. మద్యం ఆర్డర్లకు డిజిటల్ టచ్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం విక్రయించే సంస్థ టాస్మాక్(TASMAC) కీలక మార్పులు తీసుకురానుంది. మద్యం స్టాక్ ఆర్డర్లను నమోదు చేసేందుకు డిజిటల్ విధానాన్ని తీసుకురానుంది. సెప్టెంబర్ 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు టాస్మాక్ సిద్ధమైంది. పేపర్ పద్ధతికి స్వస్తి పలికి, డిజిటల్ విధానం ద్వారా పరిమితులకు లోబడి ఆర్డర్లు తీసుకునేలా చర్యలు చేపట్టింది.
కొత్త విధానంలో భాగంగా మద్యం దుకాణాల నిర్వాహకులు తమ వద్ద ఉండే ప్రత్యేక హ్యాండ్‌హెల్డ్ పరికరాల ద్వారానే స్టాక్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. స్థానిక అమ్మకాలు, డిమాండ్‌కు అనుగుణంగా వినియోగదారులకు కావలసిన బ్రాండ్ల, ఇతర వివరాలను తెలుసుకునేందుకు ఈ మార్పులు చేశామని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. మద్యం దుకాణాల సూపర్ వైజర్లు.. తమ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) నమోదు చేస్తేనే ఆర్డర్ ఓకే అవుతుంది.
డిజిటల్ విధానంలో ఖరారైన ఇండెంట్ నేరుగా స్థానిక మద్యం డిపోలకు చేరుతుంది. నమోదు చేసిన వివరాలకు పూర్తి బాధ్యత షాపు సూపర్‌వైజర్లదేనని అధికారులు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1న ప్రారంభం కానున్న ఈ వ్యవస్థ పనితీరును పర్యవేక్షించేందుకు, టాస్మాక్ సంస్థ ఒక పైలట్ దశను నిర్వహిస్తోంది. ఈ దశలో జిల్లా మేనేజర్లు సంతకం చేసిన ప్రింటెడ్ కాపీలను ప్రాసెస్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
మా తండ్రిని చంపేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: ఇమ్రాన్ కుమారులు