Share News

ఇజ్రాయెల్-లెబనాన్ ఒప్పందానికి మరోసారి హెజ్‌బొల్లా నో

ABN , Publish Date - Aug 29 , 2026 | 09:03 AM

ఇజ్రాయెల్‌-లెబనాన్‌ మధ్య కుదిరిన ఒప్పందాన్ని హెజ్‌బొల్లా మరోసారి తిరస్కరించింది. ఆ ఒప్పందం తమకు ఆమోదయోగ్యంగా లేదని స్పష్టం చేసింది.

ఇజ్రాయెల్-లెబనాన్ ఒప్పందానికి మరోసారి హెజ్‌బొల్లా నో

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్‌-లెబనాన్‌ మధ్య కుదిరిన ఒప్పందాన్ని హెజ్‌బొల్లా మరోసారి తిరస్కరించింది. ఆ ఒప్పందం తమకు ఆమోదయోగ్యంగా లేదని, దాన్ని కూల్చివేయాలని హెజ్‌బొల్లా చీఫ్‌ నయీమ్‌ ఖాసెమ్‌ స్పష్టం చేశారు.


కాగా.. జూన్‌ 26న అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా హెజ్‌బొల్లా ఆయుధాలను వదిలేయడం, దక్షిణ లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌ దళాలను దశలవారీగా ఉపసంహరించుకోవడం వంటి కీలక అంశాలున్నాయి. తొలి దశలో కొన్ని ప్రాంతాలను పైలట్‌ జోన్లుగా గుర్తించి అక్కడ హెజ్‌బొల్లా మౌలిక సదుపాయాలను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే.. ఈ విధానాన్ని ఖాసెమ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఒప్పందం చట్టవిరుద్ధమైనదని, లెబనాన్‌ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉందని ఆయన ఆరోపించారు. పైలట్‌ జోన్ల ఏర్పాటు, వాటి అమలును పర్యవేక్షించే ప్రతిపాదిత ధ్రువీకరణ వ్యవస్థనూ తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. 'మేం తలవంచం.. లొంగిపోం' అని వ్యాఖ్యానించారు.


ఇదిలా ఉండగా.. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ దాడులు, కాల్పులు కొనసాగిస్తోందని బీరుట్‌ ఆరోపిస్తోంది. సరిహద్దు వెంబడి ఇజ్రాయెల్‌ దళాలు కట్టుదిట్టమైన భద్రతా ప్రాంతాన్ని ఏర్పాటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ సైన్యం ఉపసంహరణకు హామీ లేకుండా హెజ్‌బొల్లా నిరాయుధీకరణకు అంగీకరించడం కష్టమేనని తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య సెప్టెంబర్‌ ప్రారంభంలో మరో దఫా చర్చలు జరగాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు తేదీ ఖరారు కాలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ చర్చలు ఎంతవరకు ముందుకు సాగుతాయన్నది ప్రశ్నార్థకమైంది.


ఇవీ చదవండి:

భారత్‌కూ అదే ముప్పు

చావుకి బతుక్కి మధ్య..!

Updated Date - Aug 29 , 2026 | 09:31 AM