Share News

భారత్‌కూ అదే ముప్పు

ABN , Publish Date - Aug 29 , 2026 | 05:49 AM

హిమనీనదాలు వేగంగా కరిగిపోవడం, హిమనీ సరస్సుల విస్ఫోటమే నేపాల్‌లో జలప్రళయానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. నేపాల్‌కే కాదు.. మనదేశంలోనూ హిమాలయ పర్వతశ్రేణులను...

భారత్‌కూ అదే ముప్పు

ఆందోళనకరస్థాయిలో కరుగుతున్న హిమనీనదాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 28: హిమనీనదాలు వేగంగా కరిగిపోవడం, హిమనీ సరస్సుల విస్ఫోటమే నేపాల్‌లో జలప్రళయానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. నేపాల్‌కే కాదు.. మనదేశంలోనూ హిమాలయ పర్వతశ్రేణులను ఆనుకుని ఉన్న పలు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు కూడా అదే ముప్పు పొంచి ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌లో ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలను ఆకస్మిక వరదలు ఇదే తరహాలో ముంచెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో 2013లో, చమోలీలో 2021లో సంభవించిన విపత్తులు మన కళ్ల ముందు కనిపిస్తున్న ఉదాహరణలు. ఆ రాష్ట్రంలోని చమోలి, రుద్రప్రయాగ్‌, ఉత్తరకాశి, పితోడ్‌గఢ్‌ జిల్లాల్లో, హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌, లాహౌల్‌-స్పితి, కులు లోయల్లో.. నేపాల్‌ తరహా జలప్రళయాలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఉత్తర సిక్కింలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉండే హిమనీనద సరస్సు అయిన దక్షిణ లోనాక్‌ సరస్సు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు సమాచారం. భూతాపం కారణంగా మంచు కరిగి నీటిలా మారి, ఒక పల్లపు ప్రదేశానికి చేరుకుని అక్కడ నిల్వ ఉంటుంది. దాన్నే హిమనీ సరస్సు అంటారు. మామూలు సరస్సు అయితే చుట్టూ మట్టి కట్ట ఉంటుంది కాబట్టి నీరు పెరిగినా సమస్య ఉండదు. కానీ.. ఈ హిమనీసరస్సుల చుట్టూ ఉండేది కేవలం జారుగా ఉండే మంచు. చిన్నచిన్న రాళ్ల గుట్టలు. మంచు వేగంగా కరగడం వల్ల ఆ సరస్సులో ఉండే నీటి పరిమాణం భారీగా పెరిగిపోయినా.. లేదా ఏదైనా భారీ మంచుగడ్డ/కొండచరియ వచ్చి ఆ సరస్సులో పడ్డా.. దాని చుట్టూ ఉండే మంచు కట్ట తెగిపోయి.. సరస్సులో ఉన్న నీరంతా ఒకేసారి పెనుశక్తితో కిందికి ప్రవహిస్తుంది. నేపాల్‌లో జరిగింది అదే. సిక్కింలోని దక్షిణ లోనాక్‌ సరస్సు కూడా ఇప్పుడు అలా నిండుకుండలా ఉండి ప్రమాదకరస్థితిలో ఉన్నట్టు చెబుతున్నారు. మంచు కొండల్లో ఉండే సరస్సులు ఒక్కసారి గట్టు తెగి కట్టలు తెంచుకుంటే జరిగేది విలయమే.


ఐదు నెలల ముందే హెచ్చరిక..

నేపాల్‌లో ప్రమాదం గురించి ఐదు నెలల ముందే రెండు నివేదికలు హెచ్చరించాయి. ఆ రెండు నివేదికలూ ఇచ్చింది.. ‘ద ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ మౌంటెయిన్‌ డెవల్‌పమెంట్‌ (ఇకిమోడ్‌)’. ఇండియా, నేపాల్‌, చైనా, భూటాన్‌ ప్రాంతీయ సభ్యులుగా ఉన్న ఈ సెంటర్‌ నేపాల్‌ రాజధాని ఖట్మాండు కేంద్రంగా పనిచేస్తుంది. హిందుకుష్‌ హిమాలయ ప్రాంత పరిధిలో ఈ శతాబ్దం ఆరంభం నుంచి హిమనీనదాలు రెట్టింపు వేగంతో కరిగిపోతున్నాయని.. 1975 నుంచి ఇప్పటివరకూ ఆ ప్రాంతంలో మంచు మందం 27 మీటర్ల మేర తగ్గిపోయినట్లు ఆ సంస్థ తన నివేదికల్లో పేర్కొంది. అంతేకాదు.. 1990 నుంచి 2020 నడుమ హిందుకుష్‌ హిమాలయ గ్లేసియర్లు తమ మొత్తం విస్తీర్ణంలో 12 శాతాన్ని.. మంచునిల్వల్లో 9 శాతాన్ని కోల్పోయాయని ఆందోళన వెలిబుచ్చింది. అధ్యయనంలో భాగంగా ఆ సంస్థ హిమాలయాల్లోని 38 గ్లేసియర్ల పరిస్థితిని పరిశీలించి.. వాటిలో 7 మాత్రమే ‘వరల్డ్‌ గ్లేసియర్‌ మానిటరింగ్‌ సర్వీస్‌’ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని వెల్లడించింది. కారకోరం, సిక్కిం, జాన్స్కర్‌, భూటాన్‌లో భారీ గ్లేసియర్లు ఉన్న ప్రాంతాలు చాలావరకూ సరైన పర్యవేక్షణ లేకుండానే ఉన్నాయని హెచ్చరించింది.

యూపీ, బిహార్‌ అప్రమత్తం..

నేపాల్‌లో సంభవించిన జలప్రళయం కారణంగా త్రిశూలి, భోటే-కోశి నదుల్లో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ నదులే మనదేశంలో గండకి/నారాయణి పేరుతో యూపీ, బిహార్‌ రాష్ట్రాల గుండా ప్రవహిస్తాయి. భారత సరిహద్దుకు 160 కిలోమీటర్ల దూరాన.. నేపాల్‌లోని ఫుర్ఖేఖోలా వద్ద త్రిశూలి నదిలో నీటి మట్టం పెరిగినందున ఆ నీరు యూపీ, బిహార్‌ రాష్ట్రాల్లో నారాయణి నదిలోకి ప్రవహిస్తుందని జాతీయ విపత్తు స్పందన దళం, కేంద్ర జల సంఘం హెచ్చరించాయి. ఆ హెచ్చరికలతో అప్రమత్తమైన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలూ ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించాయి. అలాగే.. నారాయణి నదిలో నీటి ప్రవాహం ప్రమాదకరస్థాయికి పెరగలేదని, ప్రస్తుతానికి ముప్పు ఏమీ లేదని స్పష్టం చేశాయి.

ఈ వార్తలనూ చదవండి:

టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Updated Date - Aug 29 , 2026 | 05:52 AM