అర్ధరాత్రి వరకు ట్యాంకర్ల సరఫరా
ABN , Publish Date - May 13 , 2026 | 07:21 AM
హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకూ వాటర్ ట్యాంకర్లకు సరఫరా చేస్తున్నారు.
రోజుకు 11 వేలకు పైగా డెలివరీలు.. ఆన్‌లైన్‌లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ
హైదరాబాద్ సిటీ: నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకూ వాటర్ ట్యాంకర్లకు సరఫరా చేస్తున్నారు. డిమాండ్ పెరగడం, బుకింగ్‌లు అధికమవ్వడంతో వాటర్‌బోర్డు అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. పగటి వేళలో గృహ అవసరాలకు ట్యాంకర్లను సరఫరా చేస్తుండగా, రాత్రి వేళలో కమర్షియల్ అవసరాలకు సరఫరా చేస్తున్నారు. డెలివరీని పూర్తిగా ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తూ పెండింగ్ లేకుండా చర్యలు చేపడుతున్నారు. రోజుకు 11 వేలకు పైగా ట్రిప్పులను డెలివరీ చేస్తున్నామని, బుక్ చేసుకున్న 24 గంటల్లోనే ట్యాంకర్‌ను అందిస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
30 ప్రాంతాల్లో అధికం
ఎండలు ముదురుతుండడంతో గ్రేటర్ హైదరాబాద్‌లో ట్యాంకర్ల డిమాండ్ మరింత పెరిగింది. ముఖ్యంగా భూగర్భ జలాలు దిగువకు పడిపోతుండడంతో అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాల్లో గల బోర్లు వట్టిపోయాయి. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో 30 ప్రాంతాల్లో ట్యాంకర్ల డిమాండ్ అధికంగా ఉన్నది. కొండాపూర్, మాదాపూర్, హఫీజ్‌పేట, మణికొండ, ఎస్‌ఆర్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, టీఎన్‌జీఓస్ కాలనీ, నిజాంపేట, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, వెంకటగిరి, ఎల్లారెడ్డిగూడ, అమీర్‌పేట, షేక్‌పేట తదితర ప్రాంతాలున్నాయి.
ఆన్‌లైన్‌లో పర్యవేక్షణ
వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో ప్రతీరోజు 1,233 ట్యాంకర్ల ద్వారా 11 వేలకు పైగా ట్రిప్పుల నీళ్లను డెలివరీ చేస్తున్నారు. 84 ఫిల్లింగ్ స్టేషన్ల వారీగా సరఫరాను ఆన్‌లైన్‌లో పర్యవేక్షించడానికి వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ప్రత్యేకంగా డాష్‌బోర్డును ఐటీ విభాగం ద్వారా సిద్ధం చేయించారు. వంద లోపు పెండింగ్ ఉంటే ఓ రంగు, 100-200మధ్య ఉంటే మరో రంగు, 200లకు పైగా ట్యాంకర్ల పెండింగ్ ఉంటే ఎరుపు రంగు డిస్‌ప్లే కావడం ద్వారా ఆయా ఫిల్లింగ్ స్టేషన్ల వారీగా అధికారులను అలర్ట్ చేసేలా రూపకల్పన చేశారు. రోజువారీ బుకింగ్‌లు, డెలివరీ, పెండింగ్.. ఇలా వివరాలన్నీ అందుబాటులో ఉంటున్నాయి. అధికంగా పెండింగ్ ఉంటే కారణాలు తెలుసుకుని 24 గంటల్లోనే ట్యాంకర్ డెలివరీ అయ్యేలా చర్యలు చేపడుతున్నారు.
డిమాండ్ కలిగిన ప్రాంతాల్లోనే..
నగరంలో నీటి డిమాండ్ కలిగిన ప్రాంతాల్లో అధికంగా ట్యాంకర్లను బుకింగ్ చేస్తున్నారు. బుకింగ్‌లకు అనుగుణంగా ట్యాంకర్లను డెలివరీ చేయడానికి ప్రత్యేకంగా ఫిల్లింగ్ స్టేషన్లను, ఫిల్లింగ్ సెంటర్లను పెంచారు. ఆయా ప్రాంతాల్లో గల దాదాపు 15 ఫిల్లింగ్ స్టేషన్లలో రోజుకు సగటున 500-800 వరకు ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. 24 గంటల్లోనే సరఫరా చేసేందుకు అర్ధరాత్రి వరకు ఫిల్లింగ్ స్టేషన్లు పని చేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ స్పెషల్ ఫోకస్
అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు: అనిత
Read Latest AP News And Telangana News And International News And Telugu News