Share News

పంచాయతీరాజ్‌కు అవార్డుల పంట

ABN , Publish Date - May 13 , 2026 | 05:38 AM

రాష్ట్రంలోని పంచాయతీలు మరో మూడు జాతీయ అవార్డులు సాధించాయి. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ఐదు జాతీయ అవార్డులు దక్కించుకోగా..

పంచాయతీరాజ్‌కు అవార్డుల పంట

  • ప్రత్యేక కేటగిరీ అవార్డులలోనూ హవా

  • రాష్ట్రానికి మరో మూడు జాతీయ అవార్డులు

  • కూటమి పాలనలో మొత్తం 19 అవార్డులు

అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పంచాయతీలు మరో మూడు జాతీయ అవార్డులు సాధించాయి. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ఐదు జాతీయ అవార్డులు దక్కించుకోగా, తాజాగా ప్రత్యేక కేటగిరీ కింద మరో మూడు అవార్డులను కైవసం చేసుకుంది. కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంగళవారం ప్రత్యేక కేటగిరీ కింద అవార్డులను ప్రకటించింది. క్లైమేట్‌ యాక్షన్‌ ప్రత్యేక పంచాయతీ అవార్డుల కింద చిత్తూరు జిల్లా కందులవారిపల్లె మొదటి ర్యాంకు సాధించింది. ఆత్మనిర్భర్‌ పంచాయతీ ప్రత్యేక అవార్డు చిత్తూరు జిల్లా కాణిపాకం పంచాయతీ రెండో స్థానం దక్కించుకుంది. పంచాయతీ క్షంత నిర్మాణ్‌ సర్వోత్తమ్‌ సంతన్‌ పురస్కార్‌ కింద చిత్తూరు జిల్లా పంచాయతీ రీసోర్స్‌ కేంద్రానికి మొదటి ర్యాంకు లభించింది. ఏప్రిల్‌ 24న జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో రాష్ట్రానికి ఐదు అవార్డులు దక్కాయి. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతాత్‌ వికాస్‌ పురస్కార్‌, నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతాత్‌ వికాస్‌ పురస్కార్‌లను మన పంచాయతీలు దక్కించుకున్నాయి. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ సతాత్‌ వికాస్‌ పురస్కార్‌ గ్రామ పంచాయతీ కేటగిరీ కింద సుపరిపాలనకు సంబంధించి అనకాపల్లి జిల్లా శృంగవరం పంచాయతీ మొదటి ర్యాంకు, మహిళా స్నేహపూర్తి పంచాయతీగా తిరుపతి జిల్లా బొక్కసంపాలెంకు మొదటి ర్యాంకు, పేదరిక నిర్మూలన- జీవనోపాధుల పెంపు కేటగిరీలో కడప జిల్లా చెమ్ముళ్లపల్లి పంచాయతీ రెండో ర్యాంకు, స్వయంగా మౌలిక వసతులు కల్పించిన పంచాయతీల కేటగిరీల కింద ప్రకాశం జిల్లా గుండమలకు మూడో ర్యాంకు దక్కింది. నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయతీ సతాత్‌ వికాస్‌ పురస్కార్‌ కేటగిరీ కింద మండల స్థాయిలో చిత్తూరు జిల్లా కుప్పం మండలానికి అవార్డు దక్కింది. కాగా, కూటమి పాలనలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మొత్తం 19 అవార్డులను దక్కించుకుంది.

Updated Date - May 13 , 2026 | 05:39 AM