కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే
ABN , Publish Date - Jul 16 , 2026 | 09:11 AM
హైదరాబాద్ కేబీఆర్ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకు అధికారులు కసరత్తును వేగవంతం చేశారు.
ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు అధికారుల కసరత్తు
5 కిలోమీటర్లు కాలినడకన తిరిగిన జీహెచ్‌ఎంసీ, పోలీసు కమిషనర్లు
జంక్షన్ల పరిశీలన.. పాదచారుల రక్షణకు పెలికాన్ సిగ్నల్స్
హైదరాబాద్: బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకు అధికారులు కసరత్తును వేగవంతం చేశారు. వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు ప్రతిపాదించిన వన్‌వే మార్గ పనులను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, జాయింట్ సీపీ జోయల్ డెవిస్ సంయుక్తంగా బుధవారం పరిశీలించారు. దాదాపు ఐదు కిలోమీటర్ల మేర కాలినడకన తిరిగి జంక్షన్ల వద్ద పరిస్థితిని అంచనా వేశారు. అగ్రసేన్ కూడలి, ఫిలింనగర్, జర్నలిస్ట్ కాలనీ,
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు ప్రధాన ద్వారం తదితర ప్రాంతాలను సందర్శించిన ఉన్నతాధికారులు.. ఆయా రూట్లలో ట్రాఫిక్ సరళిపై ఆరా తీశారు. ఇటీవల ఈ మార్గంలో చేపట్టిన వన్‌వే ట్రయల్ రన్ సమయంలో తలెత్తిన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులు ఇరుకుగా ఉండటం వల్లే రద్దీ వేళల్లో వాహనాలు నిలిచిపోతున్నట్లు గుర్తించారు. బాటిల్‌నెక్స్ ఉన్న చోట తక్షణమే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆర్‌వీ కర్ణన్ మాట్లాడుతూ కేబీఆర్ పార్కు పరిసరాల్లో రద్దీని నివారించేందుకు ప్రతిపాదించిన వన్‌వే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయనున్నట్టు చెప్పారు. నగర ట్రాఫిక్ పోలీస్‌లు సూచించిన సివిల్ పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. సజ్జనార్ మాట్లాడుతూ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు అన్ని విభాగాలూ సమన్వయంతో పనిచేస్తున్నట్టు చెప్పారు.
పాదచారుల రక్షణ కోసం లేన్ మార్కింగ్‌లు, పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ సంతోష్, ట్రాఫిక్ డీసీపీ కాజల్‌తోపాటు జీహెచ్‌ఎంసీ, పోలీస్ విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సంక్షోభాల వేళా రైతుల సంక్షేమానికి పెద్దపీట
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News