హైదరాబాద్‌లో వైభవంగా ఆషాఢ బోనాలు.. సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
ABN , Publish Date - Jul 16 , 2026 | 07:36 AM
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల మహోత్సవాలు నేటి(జులై 16) నుంచి ప్రారంభమయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 3 వేలకు పైగా ఆలయాల్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు.
హైదరాబాద్, జులై 16: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల మహోత్సవాలు నేటి(జులై 16) నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి, ఆధ్యాత్మిక విశ్వాసానికి అద్దం పట్టే ఈ వేడుకల ప్రారంభం సందర్భంగా నగర ప్రజలకు, భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగ సామాజిక ఐక్యతకు ప్రతీక అని కొనియాడిన ఆయన.. భక్తుల నమ్మకాలకు, సంప్రదాయాలకు భంగం కలగకుండా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.20 కోట్ల నిధులను కేటాయించిందని గుర్తుచేశారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని 'ఎక్స్' వేదికగా ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
ఉత్సవాల నిర్వహణలో భాగంగా దేవాలయాల పరిసరాల్లో పారిశుద్ధ్యం, నిరంతర తాగునీటి సరఫరా, నిరంతరాయ విద్యుత్, వైద్య సేవలతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, కట్టుదిట్టమైన భద్రత, అగ్నిమాపక సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వేలాది ఆలయాల్లో భక్తుల రద్దీని తట్టుకునేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ అధికారిక పర్యవేక్షణలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ బోనాల జాతరను విజయవంతం చేసేందుకు సర్వం సిద్ధమైంది.
ఇవి కూడా చదవండి...
కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు
జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News