Share News

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 15 , 2026 | 01:27 PM

పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు చేరి ఈ డెల్టాను సస్యశ్యామలం చేస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు కృష్ణా నది నుంచి నీటి ప్రవాహం తగ్గిందని తెలిపారు.

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి, జులై 15: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కృష్ణా- గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో కృష్ణవేణి - గోదావరి నదుల సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జలాలకు పుష్పమాల, వస్త్రాలు, పసుపు- కుంకుమ సమర్పించారు. కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి ఇచ్చారు. ఆపై ప్రముఖ ఇంజినీర్ కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ఇంజినీర్‌గా కేఎల్ రావు స్ఫూర్తి ప్రతి గ్రామానికీ తీసుకెళ్లేలా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు చేరి ఈ డెల్టాను సస్యశ్యామలం చేస్తున్నాయన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు కృష్ణా నది నుంచి నీటి ప్రవాహం తగ్గిందని తెలిపారు.


ఆ నిర్ణయం ఏపీని దేశానికే అన్నపూర్ణగా మార్చింది..

రైతులు పండించిన పంటలు తుఫాన్ల బారిన పడి నష్టపోతున్న దుస్థితి నుంచి రక్షించాలనే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టామని సీఎం వెల్లడించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, హీరాకుడ్, కోసీ లాంటి ప్రధానమైన డ్యామ్‌ల నిర్మాణంలో కేఎల్ రావు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఐక్యరాజ్య సమితి తరఫున అంతర్జాతీయ జల నిపుణులుగా ఈజిప్ట్, సూడాన్ లాంటి దేశాల్లోనూ సేవలందించారన్నారు. విజయవాడలో పుట్టి ఎంపీగా ఎన్నికై ముగ్గురు ప్రధానుల వద్ద కేఎల్ రావు కేంద్రమంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. నీటి పారుదల రంగం, జల విద్యుత్ ఉత్పత్తి లాంటి అంశాలపై పనిచేసి దేశానికి సేవలందించారన్నారు. గోదావరి ప్రాంతంలో ధవళేశ్వరం, కృష్ణానదిపై కృష్ణాబ్యారేజీని సర్ ఆర్థర్ కాటన్ నిర్మాణం చేశారని.. ఇది ఏపీని దేశానికే అన్నపూర్ణగా మార్చిన నిర్ణయమని సీఎం చెప్పుకొచ్చారు. కేఎల్ రావు ఈ ప్రాజెక్టులను ఆధునీకరించి డెల్టాను సస్యశ్యామలం చేశారన్నారు. శివరామకృష్ణయ్య, కేఎల్ రావు తర్వాత ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంపై ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్ అని.. సాగునీటి రంగాన్ని తీర్చిదిద్దటంలో వీరంతా స్ఫూర్తి అంటూ వెల్లడించారు. వాగులు, వంకలు, నీటి ఊటలు కూడా ఇప్పుడు అడుగంటిపోయాయని, భూగర్భజలాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.


80 టీఎంసీల గోదావరి నీటితో కృష్ణా డెల్టా సస్యశ్యామలం

రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారిపోకుండా చర్యలు చేపట్టామని చంద్రబాబు తెలిపారు. గోదావరి- కావేరి అనుసంధానించాలని కేఎల్ రావు ప్రతిపాదించారని గుర్తుచేశారు. నదుల అనుసంధానం జరిగితే భారత్‌కు అద్భుతమైన అవకాశాలు వస్తాయన్నారు. గంగా-కావేరీ అనుసంధానం కోసం మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో ఓ టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేశారన్నారు. 2014లో విభజన తర్వాత బస్సులోనే బస చేసి కృష్ణా డెల్టాకు న్యాయం చేసేలా పట్టిసీమ ప్రారంభించామని ఆనాటి సంగతులను గుర్తుచేశారు. 80 టీఎంసీల గోదావరి నీటిని తీసుకువచ్చి కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేశామన్నారు. నీల వర్ణంలోని కృష్ణా జలాలు, అరుణ వర్ణంలోని గోదావరి జలాలు కలిసి ఈ ప్రాంతంలో బంగారం పండించాయని ఆనందం వ్యక్తం చేశారు. గోదావరి నుంచి కనీసం సగటున ఏడాదికి 2 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్తోందన్నారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని... రాష్ట్రానికి జీవనాడిగా మారుస్తామని స్పష్టం చేశారు.


ఆ నీరే కృష్ణా డెల్టాను కాపాడుతోంది..

పట్టిసీమ వట్టిసీమ అని అవహేళన చేశారని.. ప్రాజెక్టు దండగ అన్నారని... ఇప్పుడు ఆ నీరే డెల్టాను కాపాడుతోందని సీఎం తెలిపారు. ఆ నీరే రాకపోతే కృష్ణా డెల్టా పరిస్థితి ఏమిటన్నది అంతా ఆలోచించాలన్నారు. 2015-2025 వరకూ 450 టీఎంసీల నీటిని తరలించామని.. పట్టిసీమకు రూ.1300 కోట్లు మాత్రమే ఖర్చు చేశామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైటెక్ సిటీ నిర్మిస్తే దండగన్నారని.. ధైర్యంగా ముందుకు వెళ్లబట్టే ఐటీకి కేంద్రంగా హైదరాబాద్ నిలబడిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అమరావతిని కూడా అద్భుతమైన నగరంగా నిర్మిస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలోని కొందరు.. రైతుల్ని రెచ్చగొట్టి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని సీఎం చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు.ఈ కార్యక్రమానికి మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

జగన్ హయాంలో ఇసుక అక్రమాల కేసు.. ఈడీ ముందుకు కీలక సాక్షి

ప్రభుత్వ వైద్యాన్ని ప్రజల తొలి ఎంపికగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి సత్యకుమార్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 15 , 2026 | 01:49 PM