ప్రభుత్వ వైద్యాన్ని ప్రజల తొలి ఎంపికగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Jul 15 , 2026 | 01:04 PM
ఏపీ ఆయుష్ విభాగంలో రూ.350 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆయుష్ మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
విజయవాడ, జులై 15: ఏపీ ఆయుష్ విభాగంలో రూ.350 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈరోజు(బుధవారం) విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ‘ఔషధ మొక్కలు ఆరోగ్యానికి అసలైన ఆధారం’ వన్డే వర్క్ షాప్‌లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఆయుష్ మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. నాలుగు కొత్త ఆయుష్ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని.. ధర్మవరం, పిఠాపురంలో ఆయుర్వేద కాలేజీలు ఉన్నాయని వెల్లడించారు. ఒక్కో కాలేజీకి ప్రభుత్వం రూ.70 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఆరు ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆస్పత్రులు ప్రారంభం కానున్నాయని తెలిపారు.
తిరుపతి, తెనాలి, నందిగామ సహా ఆరు ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆస్పత్రులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని.. ఒక్కో ఆస్పత్రికి రూ.20 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని మంత్రి చెప్పారు. 1,500లకు పైగా ఆయుష్ డిస్పెన్సరీలను ఆధునీకరించామన్నారు. ప్రివెంటివ్, వెల్‌నెస్ హెల్త్‌కేర్‌పై ప్రభుత్వ దృష్టి సారించిందన్నారు.'సంజీవని' డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్ అమలు చేస్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో కేంద్ర ఆయుష్ మంత్రి చేతుల మీదుగా కొత్త సదుపాయాల ప్రారంభానికి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. అశ్వగంధ, మునగ, ఉసిరి సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు 20 శాతానికి పెరిగాయని, గుంటూరు జీజీహెచ్‌లో 255 ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగాయని మంత్రి వెల్లడించారు. 2026-27కు అదనంగా 325 ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వనున్నామన్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ప్రభుత్వ వైద్యాన్ని ప్రజల తొలి ఎంపికగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంతెన సత్యనారాయణ రాజు, ఆరోమాటిక్ ప్లాంట్స్ సీఈవో చంద్రశేఖర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
ప్రశాంత్ రెడ్డి నిర్బంధం.. ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనం: హరీశ్ రావు
జగన్ హయాంలో ఇసుక అక్రమాల కేసు.. ఈడీ ముందుకు కీలక సాక్షి
Read Latest AP News And Telugu News