Share News

ప్రేమ వ్యవహారం.. హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య

ABN , Publish Date - Jul 15 , 2026 | 10:58 AM

హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో దాడి చేసి మరీ యువకుడిని కొందరు వ్యక్తులు కిరాతకంగా చంపేశారు.

ప్రేమ వ్యవహారం.. హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య
Hyderabad News

హైదరాబాద్, జులై 15: నగరంలోని మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో దాడి చేసి మరీ యువకుడిని కొందరు వ్యక్తులు కిరాతకంగా చంపేశారు. మృతుడు వరంగల్ జిల్లా మాదన్నపేట్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చిన్నపల్లి భాస్కర్‌గా పోలీసులు గుర్తించారు. కులాంతర ప్రేమ వ్యవహారమే హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.


ఉప్పరపల్లి గ్రామానికి చెందిన యువతిని భాస్కర్ ప్రేమించాడు. అయితే కులం వేరు కావడంతో వారి ప్రేమను అమ్మాయి కుటుంబ సభ్యులు అగింకరించలేదు. మూడు సంవత్సరాల క్రితం అమ్మాయిని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి అయినప్పటి నుంచీ అమ్మాయికి భర్తతో తరుచూ గొడవలు జరిగాయి. దీంతో ఆమెకు భర్త విడాకులు ఇచ్చేశాడు. తన కూతురి విడాకులకు కారణం గతంలో ప్రేమించిన భాస్కర్ కారణమని అమ్మాయి తండ్రి రాజు కక్ష పెంచుకున్నాడు. గతంలో భాస్కర్‌ను చంపుతామంటూ అమ్మాయి తండ్రి, కుటుంబసభ్యులు బెదిరించినట్లు తెలుస్తోంది.


ఈ క్రమంలో నిన్న(మంగళవారం) రాత్రి హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీలో భాస్కర్ ఉంటున్న హాస్టల్‌కు ఐదుగురు వ్యక్తులు వచ్చారు. హాస్టల్‌ నుంచి కిందకు వచ్చిన భాస్కర్‌ను దుండగులు అతికిరాతకంగా కత్తులతో పొడిచి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే అమ్మాయి కుటుంబసభ్యులే తన తమ్ముడిని హత్య చేశారంటూ భాస్కర్ అన్న మధు మాదాపూర్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


భాస్కర్ మృతిపై తోటి సిబ్బంది..

‘గత రెండేళ్లుగా భాస్కర్ మా వద్ద చెఫ్‌గా పని చేస్తున్నాడు. భాస్కర్ కోసం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో కొందరు వ్యక్తులు వచ్చారు. భాస్కర్‌తో మాట్లాడాలని చెప్పడంతో గేటు బయటకు రాగానే అతడిపై దాడి చేశారు. కత్తులు, కర్రలతో కొట్టారు... దీంతో స్పాట్‌లోనే చనిపోయాడు. రెండేళ్లలో భాస్కర్ కోసం ఎవరూ రాలేదు.. రాత్రి వచ్చిన వాళ్లను మొదటిసారి చూశాము. మేము అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు ఆగలేదు . ‘మా పరువు తీశావ్’ అంటూ భాస్కర్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు’ అంటూ తోటి సిబ్బంది చెప్పారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌-తిరుపతి ఉదయం విమాన టికెట్లకు భారీ డిమాండ్

ప్రశాంత్ రెడ్డి నిర్బంధం.. ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనకు నిదర్శనం: హరీశ్ రావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 15 , 2026 | 11:36 AM