సంక్షోభాల వేళా రైతుల సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Jul 16 , 2026 | 06:26 AM
మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమంపై మరోసారి తన అంకితభావాన్ని చాటుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యూరియా సబ్సిడీ పథకాన్ని..
యూరియా సబ్సిడీ పథకం కొనసాగింపు మోదీ సర్కారు అంకితభావానికి నిదర్శనం
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ, జూలై 15(ఆంధ్రజ్యోతి): మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమంపై మరోసారి తన అంకితభావాన్ని చాటుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యూరియా సబ్సిడీ పథకాన్ని రూ.1,51,709 కోట్లతో కొనసాగించాలన్న కేంద్ర క్యాబినెట్ నిర్ణయం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో తెలంగాణ సహా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. కోవిడ్ సమయంలో, తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రస్తుతం కొనసాగుతున్న పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా ఎరువులు, సహజవాయువు ధరలు భారీగా పెరిగినా మన దేశంలో రైతులపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుందన్నారు. 45 కిలోల యూరియా బస్తాపై రూ.1680 సబ్సిడీ ఇస్తోందని చెప్పారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, కొత్త ప్లాంట్ల ప్రారంభంతో దేశీయంగా యూరియా ఉత్పత్తి 2014-15లో సుమారు 225 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2024-25 నాటికి 306.67 లక్షల టన్నులకు పెరిగిందని తెలిపారు. రామగుండం ఎరువుల కార్మాగారాన్ని రూ.6,400 కోట్లతో పునరుద్ధరించామని, దీని లాభం నేరుగా తెలంగాణకు లభిస్తోందని తెలిపారు. గత 12 ఏళ్లలో కేంద్రం తెలంగాణ రైతులకు యూరియాపై రూ.86,729 కోట్ల సబ్సిడీ అందించిందన్నారు. మోదీ సర్కారు నిర్ణయాలతో 2 ఎకరాలున్న రైతుకు ఏడాదికి యూరియా సబ్సిడీతోనే రూ.25,360 లబ్ధి చేకూరుతోందని తెలిపారు. కాగా, ప్రపంచ మైనింగ్ శక్తిగా భారత్‌ను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కిషన్‌రెడ్డి చెప్పారు. ‘ఇండియా మైనింగ్ వీక్’లో ఆయన మాట్లాడుతూ 12 ఏళ్లలో 700మైనింగ్ బ్లాక్‌ల వేలం పారదర్శకంగా జరిగిందని తెలిపారు. వరుసగా రెండో ఏడాదీ బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, డిస్పాచ్ మైలురాయిని అధిగమించామని చెప్పారు.