Share News

పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయండి

ABN , Publish Date - Jul 16 , 2026 | 06:39 AM

చిన్నారులకు భద్రత, గౌరవం, స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించాలని, ఇది రాజ్యాంగంలోనే పొందుపరిచారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయండి

  • తెలంగాణ సీఎం, ఏపీ సీఎస్‌కు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ లేఖ

అమరావతి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): చిన్నారులకు భద్రత, గౌరవం, స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించాలని, ఇది రాజ్యాంగంలోనే పొందుపరిచారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పోక్సో కేసులపై నిర్లక్ష్యం, వాటి ద్వారా జరుగుతున్న అక్రమాలపై ఆయన తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌లకు బుధవారం ప్రత్యేకంగా లేఖలు రాశారు. పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, ఈ విషయాన్ని సుప్రీం కోర్టు, ఐక్యరాజ్యసమితి స్పష్టంగా చెబుతున్నాయని ఆ లేఖలో గుర్తుచేశారు. ఈ మధ్య కాలంలో పోక్సో కేసుల నిర్లక్ష్యంపై తన కార్యాలయానికి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. చాలామంది బాధితులు న్యాయం కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారని వివరించారు. పోలీసుల విచారణలో ఆలస్యం వల్లే బాధితులకు న్యాయం జరగడం లేదని, కొంతమంది ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు సరైన సమయానికి న్యాయం జరగాలంటే పోక్సో చట్టం కోసం ప్రత్యేక మార్గదర్శకాలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. పోక్సో కేసులను సాధారణ కేసులుగా కా కుండా, ప్రత్యేక కేసులుగా పరిగణించాలని కోరారు. కాగా, కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్‌ కల్యాణ్‌ బుధవారం ఉదయం ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.

Updated Date - Jul 16 , 2026 | 06:40 AM