180 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Aug 15 , 2026 | 09:55 AM
హైదరాబాద్‌లోని మియాపూర్-ఆల్విన్ ఎక్స్ రోడ్డు మధ్య భారీ మౌలిక వసతుల నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.
మియాపూర్-ఆల్విన్ ఎక్స్ రోడ్డులో ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణాలు
నేటి నుంచి ప్రారంభం కానున్న పనులు
ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలంటున్న అధికారులు
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్‌లోని మియాపూర్-ఆల్విన్ ఎక్స్ రోడ్డు మధ్య భారీ మౌలిక వసతుల నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ఆగస్టు 14 నుంచి 180 రోజుల పాటు ఈ మార్గంలో పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రాజెక్టు విభాగం ఆధ్వర్యంలో ఓల్డ్ ముంబై హైవేపై నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మియాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్డు వరకు ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. అలాగే ఆల్విన్ ఎక్స్ రోడ్డు నుంచి హఫీజ్‌పేట్ వరకు 3 లేన్ల ఏకదిశలో (ఒకవైపు) అండర్‌పాస్, బాచుపల్లి నుంచి మియాపూర్ ఎక్స్ రోడ్డు వరకు 3 లేన్ల మార్గం నిర్మాణంలో ఉంది. ఈ పనులు మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్నాయని తెలిపారు.
ముందుగానే బయలుదేరాలి..
నిర్మాణ కార్యకలాపాల కారణంగా ముఖ్యంగా ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో మియాపూర్ ఎక్స్ రోడ్-ఆల్విన్ ఎక్స్ రోడ్ మార్గంలో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిర్మాణ పనుల కాలంలో వాహనదారులు వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని, ప్రయాణానికి అదనపు సమయం కేటాయించుకుని ముందుగానే బయలుదేరాలని పోలీసులు సూచించారు. ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి వాహనాల సాఫీ రాకపోకలకు తోడ్పడాలని కోరారు.
ప్రణాళిక సిద్ధం చేసుకోండి..
మియాపూర్, హఫీజ్‌పేట్, బాచుపల్లి, ఆల్విన్ ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్ వైపు రాకపోకలు సాగించే ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణ మార్గాలను, సమయాలపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఫ్లైఓవర్, అండర్‌పాస్ వంటి కీలక మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రేషన్ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలెందుకు?
సింగరేణిలో మారనున్న ’గుర్తింపు’ ప్రక్రియ
Read Latest AP News And Telangana News And International News And Telugu News