Share News

సింగరేణిలో మారనున్న ’గుర్తింపు’ ప్రక్రియ

ABN , Publish Date - Aug 15 , 2026 | 12:34 AM

సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ప్రక్రియ మారనుంది. 1998లో ప్రారంభమై మూడు దశాబ్దాలుగా సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి.

సింగరేణిలో మారనున్న ’గుర్తింపు’ ప్రక్రియ

గోదావరిఖని, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ప్రక్రియ మారనుంది. 1998లో ప్రారంభమై మూడు దశాబ్దాలుగా సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను 2025 నవంబరు 21 నుంచి అమలులోకి తీసుకువచ్చింది. ఇందులో కోడ్‌ ఆన్‌వేజెస్‌ 2019, ఇండస్ర్టియల్‌ రిలేషన్‌ కోడ్‌ 2020, కోడ్‌ ఆన్‌ సోషల్‌ సెక్యూరిటీ-2020, ఆక్యుపేషనల్‌ సేఫ్టీ హెల్త్‌ అండ్‌ వర్కింగ్‌ కండిషన్స్‌-2020 కోడ్‌లు గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను ఇవి ఏకీకృతం చేశాయి. 2020 ఐఆర్‌ కోడ్‌కు అదనంగా ఇండస్ర్టియల్‌ రిలేషన్‌(సెంట్రల్‌) రూల్స్‌ 2026ను కేంద్ర ప్రభుత్వం 8మే 2026న గెజిట్‌ చేసింది. ఈ కారణంగా ఇండస్ర్టియల్‌ డిస్ర్టిబ్యూట్‌ యాక్ట్‌, ట్రేడ్‌ యాక్ట్‌ ఆధారంగా ఎన్నికలు నిర్వహించడం చట్టప్రకారం ప్రశ్నార్థకంగా మారింది. కొత్తగా వచ్చిన ఐఆర్‌ యాక్ట్‌ ప్రకారం సింగరేణి ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

51శాతం, 20శాతం నిబంధన

కొత్త ఐఆర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 14లో రిజిస్ర్టేషన్‌ ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికకు సంబంధించి సింగరేణి ఎన్నికలు మారనున్నాయి. పాత పద్ధతిలో ఉన్న గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల స్థానంలో సంప్రదింపుల సంఘం లేదా సంప్రదింపుల కౌన్సిల్‌ ఉండే అవకాశం ఉంది. అలాగే సంస్థలో ఒకే ఒక్క రిజిస్ర్టేషన్‌ కలిగిన ట్రేడ్‌ పని చేస్తున్నట్లయితే సోలో నెగోసేషన్‌ సంఘంగా గుర్తించవచ్చు. కానీ సింగరేణి 14 రిజిష్టర్డ్‌ యూనియన్లు ఉన్నాయి. సింగరేణిలో మాస్టర్‌ రోల్‌లో ఉన్న మొత్తం కార్మికుల్లో 51శాతం లేదా అంతకన్నా ఎక్కువ మంది మద్దతు ఉన్న సంఘాన్ని సంప్రదింపుల సంఘంగా గుర్తిస్తారు. ఏ సంఘానికి 51శాతం రాకుంటే 20శాతం కార్మికుల మద్దతు ఉన్న సంఘాలకు సంప్రదింపుల కౌన్సిల్‌గా గుర్తిస్తారు. సంఘాల వెరిఫికేషన్‌ ప్రక్రియ పాత పద్ధతిలో ఉన్నప్పటికీ రహస్య బ్యాలెట్‌ పద్ధతినే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. ఈ ఎన్నికల్లో ఓటరు జాబితా కూడా కీలకం కానున్నది.

మారనున్న గుర్తింపు కాలం...

ఐఆర్‌ కోడ్‌ సెక్షన్‌ 14(6) ప్రకారం సంప్రదింపుల సంఘం లేదా సంప్రదింపుల కౌన్సిల్‌ కాలపరిమితి మూడు సంవత్సరాలపాటు చెల్లుబాటు అవుతుంది. ఉద్యోగులు, సంఘాల పరస్పర అంగీకారంతో ఈ కాలాన్ని మరో రెండు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు.

ఏఐటీయూసీకి ప్రస్తుత పరిస్థితి...

సింగరేణిలో 2023 డిసెంబర్‌ 27న ఎన్నికలు జరిగాయి. గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలిచింది. రెండు సంవత్సరాల కాలపరిమితితో 2025 డిసెంబర్‌ 26తో కాలపరిమితి ముగిసింది. 2026 ఏప్రిల్‌ నాటికి ఎన్నికలు జరుగాల్సి ఉండగా యాజమాన్యం నిర్ణయం స్పష్టంగా లేకపోవడంతో ఎన్నికలు జరుగలేదు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా కొత్త ఐఆర్‌ యాక్టు ప్రకారమే నిర్వహించాల్సి ఉంటుంది.

పోలైన ఓట్లు కాదు... మొత్తం కార్మికులే లెక్క...

కార్మిక సంఘం ఎన్నికల్లో ఇది అత్యంత ముఖ్యమైన అంశం. ఐఆర్‌ కోడ్‌ సెక్షన్‌ 14(3)లో వర్కర్స్‌ ఆన్‌ ద మాస్టర్‌ రోల్‌ ఆధారంగా 51శాతం మద్దతు అని ఉన్నది. అంటే పోలైన ఓట్లలో 51శాతం కాదు. మొత్తం సింగరేణిలో ఉన్న కార్మికుల సంఖ్యలో 51శాతం రావాల్సి ఉంటుంది.

రెండంచెల వ్యవస్థకు ముప్పు...

సింగరేణిలో గెలిచిన సంఘానికి గుర్తింపు సంఘంగా, డివిజన్ల వారీగా గెలిచిన సంఘాలకు పాత్రినిధ్య సంఘాలుగా అవకాశాలు ఉండేవి. కొత్త కోడ్‌ ప్రకారం సంస్థలోని పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ అధికారి ఎన్నికల నోటిఫికేషన్‌లో మాత్రమే స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నది. మొత్తంగా సింగరేణి ఎన్నికలు పాత పద్ధతిలో జరిగే అవకాశం లేదు.

Updated Date - Aug 15 , 2026 | 12:34 AM