Share News

వెస్ట్‌పై భారం తగ్గించి.. ఫ్యూచర్‌తో కొత్త దిశ కల్పిస్తాం

ABN , Publish Date - Nov 29 , 2026 | 05:16 AM

పశ్చిమ ప్రాంతంపై పడుతున్న విపరీతమైన ట్రాఫిక్‌, జనాభా ఒత్తిడి తగ్గింపునకు నలువైపులా హైదరాబాద్‌ నగర విస్తరణకు తమ ప్రభుత్వం అడుగులేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు.

వెస్ట్‌పై భారం తగ్గించి.. ఫ్యూచర్‌తో కొత్త దిశ కల్పిస్తాం

  • నగరం నలువైపులా అభివృద్ధితోనే ట్రాఫిక్‌కు పరిష్కారం

  • వారానికి ‘ఒకరోజు నో కారు డే అమలు’ ఉద్యమం కావాలి

  • సైబరాబాద్‌ మూవ్స్‌ సదస్సు ముగింపులో మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ ప్రాంతంపై పడుతున్న విపరీతమైన ట్రాఫిక్‌, జనాభా ఒత్తిడి తగ్గింపునకు నలువైపులా హైదరాబాద్‌ నగర విస్తరణకు తమ ప్రభుత్వం అడుగులేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘ఫ్యూచర్‌ సిటీ, ఏఐ సిటీ, క్వాంటం సిటీ’ల ద్వారా భావితరాలకనుగుణంగా నగరం నలుమూలల మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. సైబరాబాద్‌ మునిసిపల్‌, పోలీసు కమిషనరేట్లు, ఎస్సీఎస్సీ, డబ్ల్యూఆర్‌ఐ సంయుక్తంగా 3 రోజులు నిర్వహించిన ‘సైబరాబాద్‌ మూవ్స్‌-2026’ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. 2000-25 మధ్య గత పాతికేళ్లలో ప్రతిఏటా హైదరాబాద్‌ నగరం 10.7 కి.మీ మేర విస్తరిస్తోందన్నారు.


అయినా 70 శాతం జనాభా కోర్‌ సిటీ వెలుపలే కేంద్రీకృతమైందని.. ముఖ్యంగా సైబరాబాద్‌లో కేవలం 2 చ.కి.మీ పరిధిలోనే సుమారు 9 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తుండటం రవాణా వ్యవస్థకు పెను సవాల్‌గా మారిందన్నారు. జినోమ్‌ వ్యాలీ ఉద్యోగులు నివాసం కోసం పశ్చిమ ప్రాంతం వైపే చూస్తున్నాయన్నారు. ఉపాధి అవకాశాలు చేజారకూడదని విదేశీ సంస్థలు, జీసీసీ ప్రతినిధుల సౌలభ్యం కోసం పశ్చిమ ప్రాంతంలోనే స్థలం కేటాయిస్తున్నా.. భవిష్యత్తు దృష్ట్యా అభివృద్ధిని వికేంద్రీకరించాల్సి ఉందని శ్రీధర్‌బాబు చెప్పారు. తూర్పు ప్రాంతంలో ఇటీవలే ఓ భారీ ఐటీ సంస్థను ప్రారంభించి.. సామాజిక మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామన్నారు.


నివాసాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, ఇతర సామాజిక మౌలిక వసతులు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండాలని చెప్పారు. కేవలం మౌలిక వసతుల కల్పనతోనే ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కాదని.. వారంలో ఒకరోజు ‘నో కార్‌ డే’ ఉద్యమం కావాలన్నారు. ఫుట్‌పాత్‌లపై వ్యాపారంతో ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారుల సమస్యలనూ పట్టణ రవాణా ప్రణాళికలో భాగంగానే చూడాలన్న శ్రీధర్‌ బాబు.. ఏళ్లుగా ఏర్పడ్డ ఈ వ్యవస్థకు ప్రత్యామ్నాయాలు చూపకుండా చర్యలు తీసుకోవద్దన్నారు. పట్టణ ప్రణాళిక అమలులో నిబంధనలు కఠినత్వం, వ్యవస్థాగత క్రమశిక్షణ తప్పనిసరని చెప్పారు. కనుక కొత్త ఐటీ, పారిశ్రామిక కేంద్రాలు ఏర్పాటైతే.. పశ్చిమ హైదరాబాద్‌పై ఉద్యోగుల, వాహనాల ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్‌ అరికెపూడి గాంధీ, సైబరాబాద్‌ మునిసిపల్‌, పోలీసు కమిషనర్లు జి.సృజన, రమేశ్‌ రెడ్డి, జాయింట్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం

పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 05:16 AM