ఒకటే కార్డు.. మెట్రో, బస్సుల్లో రయ్ రయ్!
ABN , Publish Date - Sep 08 , 2026 | 07:43 AM
హైదరాబాద్ వాసులకు త్వరలో నగర ప్రయాణం సులభతరం కానుంది. సిటీ బస్సు ఎక్కినా, మెట్రో రైలు ఎక్కినా.. చేతిలో ఒక్క కార్డు ఉంటే చాలు.
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్..
అందుబాటులోకి ‘కామన్‌పాస్’
మెట్రో, ఆర్టీసీకి కలిపి ఒకటే కార్డు
ఉద్యోగులు, విద్యార్థుల ప్రయాణ తిప్పలకు పరిష్కారం
చర్యలు వేగవంతం చేయాలని సీఎస్ ఆదేశం
డైలీ, మంత్లీ పాస్‌లపై అధికారుల కసరత్తు
త్వరలోనే పట్టాలెక్కనున్న సరికొత్త విధానం
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ వాసులకు త్వరలో నగర ప్రయాణం సులభతరం కానుంది. సిటీ బస్సు ఎక్కినా, మెట్రో రైలు ఎక్కినా.. చేతిలో ఒక్క కార్డు ఉంటే చాలు. దర్జాగా గమ్యస్థానాలకు చేరిపోవచ్చు. గ్రేటర్ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘ఆర్టీసీ-మెట్రో కామన్ మొబిలిటీ పాస్’ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.
దీంతో నగర వాసుల ఆరేళ్ల నిరీక్షణ ఫలించనుంది. ఒకే కార్డుతో ఇటు మెట్రో రైళ్లు, అటు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించే సౌకర్యాన్ని కల్పించాలని ఉద్యోగులు, విద్యార్థులు ఎంతో కాలంగా ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. తద్వారా రద్దీవేళల్లో సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో మెట్రో, ఆర్టీసీని ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి.. ప్రజలకు టికెట్ రహిత ప్రయాణాన్ని అందించాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ఆచరణకు నోచుకోలేదు.
కామన్ పాస్ కోసం ఏర్పాట్లు..
నగరంలో ప్రజారవాణా అవసరాలు పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. మెట్రో, ఆర్టీసీతో కలిపి కామన్‌పాస్ తీసుకురావడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రయాణికుల వెసులుబాటు కోసం రోజువారీ(డైలీ), నెలవారీ(మంత్లీ) కామన్ పాస్‌లను రెండు వారాల్లో అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. మెట్రో, ఆర్టీసీకి సంబంధించిన టికెట్ ఆదాయాన్ని ఎలా పంచుకోవాలన్న అంశంపై దృష్టిపెట్టారు. ఉదాహరణకు ఉప్పల్‌లో మెట్రో ఎక్కి రాయదుర్గంలో దిగి..
అక్కడి నుంచి బస్సులో వెళ్లే ఉద్యోగుల నుంచి టికెట్ రూపంలో ఎంత తీసుకోవాలి? దాన్ని మెట్రో-ఆర్టీసీ ఏ నిష్పత్తిలో పంచుకోవాలనే ఆదాయ పంపకాలను తేల్చే పనిలోపడ్డారు. అలాగే, నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే వారు.. తమ కార్యాలయాల కోసం మెట్రోల్లో కొంతదూరం ప్రయాణించి.. అక్కడి నుంచి బైక్, ఆటోలు బుక్ చేసుకుని వెళ్తుంటారు. ఇప్పుడు కామన్‌పా్‌స తీసుకురావడం వల్ల ఆర్టీసీకి ఆదాయం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
లక్షల మందికి ప్రయోజనం..
నగరంలోని మూడు కారిడార్లలో నిత్యం 1100 మెట్రో రైలు సర్వీసులు నడుస్తున్నాయి. వీటిల్లో రోజువారీ 4.80 లక్షల మంది వరకు ప్రయాణిస్తుంటారు. ఆర్టీసీ సంస్థ గ్రేటర్ వ్యాప్తంగా 3,200 బస్సులు (30వేల ట్రిప్పులు) నడుపుతోంది. రోజూ 25 లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇందులో మహాలక్ష్మి పథకం ద్వారా 16-18 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తుండగా.. టికెట్ ఛార్జీ చెల్లించి 7-9 లక్షల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News