Share News

బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ పోలీస్‌

ABN , Publish Date - Sep 08 , 2026 | 05:52 AM

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజే రణరంగంగా మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందంటూ అసెంబ్లీ వేదికగా నిరసన తెలిపేందుకు బీఆర్‌ఎస్‌ సభ్యులు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది.

బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ పోలీస్‌
BRS Police

  • అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. ఉద్రిక్తం

  • టీషర్టులపై నినాదాలతో అసెంబ్లీకి వెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధుల ప్రయత్నం

  • అనుమతించబోమని అడ్డుకున్న పోలీసులు

  • పోలీసులపైకి దూసుకెళ్లిన కేటీఆర్‌

  • టీషర్టు విప్పేసి బనియన్‌తో హరీశ్‌ నిరసన

  • అందరినీ అరెస్టుచేసి తెలంగాణ భవన్‌కు తరలించిన పోలీసులు

  • పోలీసులు తన చీర లాగారంటూ సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం

హైదరాబాద్‌/గన్‌పార్క్‌/నిమ్స్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజే రణరంగంగా మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందంటూ అసెంబ్లీ వేదికగా నిరసన తెలిపేందుకు బీఆర్‌ఎస్‌ సభ్యులు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రాసి ఉన్న నల్ల టీషర్టులు ధరించి వచ్చిన ఆ పార్టీ సభ్యులను అసెంబ్లీ లోపలికి వెళ్లకుండా పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. నినాదాలు రాసిన నల్ల టీషర్టులతో అసెంబ్లీ లోపలికి అనుమతించవద్దంటూ తమకు స్పీకర్‌ ఆదేశాలున్నాయని తెలిపారు. టీషర్టులు తొలగించి సభలోకి వెళ్లాలని సూచించారు. అయితే అందుకు నిరాకరించిన బీఆర్‌ఎస్‌ సభ్యులు నినాదాలు చేస్తూనే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద పోలీసులకు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపుతప్పి ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఎవరు మీరంటూ వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో కేటీఆర్‌ చేతికి, నుదుటిపైనా గాయాలయ్యాయి. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా కాలికి గాయం అయింది. మరోవైపు బీఆర్‌ఎ్‌సఎల్పీ ఉపనేత హరీశ్‌రావు సైతం తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీషర్టులే మీకు అడ్డమా? అంటూ దానిని విప్పేసి బనియన్‌పై నిరసన తెలిపారు. కాగా, ప్రభుత్వం మారినంత మాత్రాన ఇంత దౌర్జన్యం చేస్తారా? అసలు మీరేం అనుకుంటున్నారు? అంటూ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.


అరెస్టును ప్రతిఘటించిన కేటీఆర్‌..

తోపులాట అనంతరం పోలీసులు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్టుచేసి తెలంగాణ భవన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను పోలీస్‌ వాహనంలోకి ఎక్కించే సమయంలో ఆయన ప్రతిఘటించారు. ఆయనతోపాటు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ.వివేకానంద, సంజయ్‌తోపాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, తోపులాటలో భాగంగా పోలీసులు తన చీరలాగి అవమానించారని ఎమ్మెల్యే సునీత ఆరోపించారు. ఇందుకు పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. మరోవైపు పోలీసులతో వాగ్వాదం సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తమను లోపలికి రానివ్వవద్దని చెప్పిందెవరంటూ స్పీకర్‌ను ఉద్దేశించి మధు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలతో అసెంబ్లీ బయట పబ్లిక్‌గార్డెన్‌ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. అంతకుముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ బీఆర్‌ఎ్‌సపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. తమకు నిందలు, విమర్శలు, పోలీసులు కొత్తకాదని, ఉద్యమ పార్టీగా ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నామని తెలిపారు.


గాయడిన బీఆర్‌ఎస్‌ నేతలకు నిమ్స్‌లో చికిత్స

అసెంబ్లీ గేటు వద్ద జరిగిన తోపులాటలో గాయపడ్డ బీఆర్‌ఎస్‌ నేతలకు నిమ్స్‌ చికిత్స అందించారు. ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖరరెడ్డి, సంజయ్‌, ఎమ్మెల్సీ యాదవరెడ్డిలకు ప్రథమ చికిత్స చేసి పంపించారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని మాత్రం ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందించారు. రాత్రి 9.30 గంటల సమయంలో జగదీశ్‌రెడ్డిని వైద్యులు డిశ్చార్జి చేశారు.


అసెంబ్లీ పరిణామాలపై గవర్నర్‌ ఆరా..!

శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా జరిగిన పరిణామాలపై గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఆరా తీశారు. ముఖ్యంగా అసెంబ్లీ గేటు వద్ద సోమవారం ఉదయం ఏం జరిగింది? బీఆర్‌ఎస్‌ నాయకులు ఎవరేం మాట్లాడారు? జరిగిన వాగ్వాదం ఏంటి? తదనంతర పరిస్థితేంటన్న దానిపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు.. స్పీకర్‌పై చేసిన తీవ్ర వ్యాఖ్యలపై సభలో చర్చ, పోలీస్‌ చర్యలు, ఇతర పరిణామాలపై గవర్నర్‌ ఆదేశాల మేరకు లోక్‌భవన్‌ అధికారులు సంబంధిత విభాగాల అధికారుల నుంచి సమగ్ర వివరాలతో నివేదిక సేకరించి ఇచ్చినట్లు తెలిసింది.


పోలీసుల దాడి ఆరోపణలపై నివేదిక ఇవ్వండి

  • డీజీపీకి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఆదేశం

అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేసి, దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య సోమవారం డీజీపీకి లేఖ రాశారు. బీఆర్‌ఎ్‌సకు చెందిన ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, జె.అనిల్‌జాదవ్‌, విజయుడు, మాణిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు. అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో పోలీసులు తమపై అనుచితంగా ప్రవర్తించడంతోపాటు దాడి చేశారని, దుర్భాషలాడారని ఎమ్మెల్యేలు కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది తమపై జరిగిన దాడి మాత్రమే కాదని, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలపై జరిగిన దాడిగా భావిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. ఎమ్మెల్యేలపై హింస, బెదిరింపులు, అవమానం లేదా వారి హక్కులకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది.


స్పీకర్‌ ఆదేశాలను అమలు చేశాం: డీసీపీ శిల్పవల్లి

పోలీసులు మాత్రం తాము స్పీకర్‌ ఆదేశాలనే అమలు చేశామని తెలిపారు. నల్ల టీషర్టులు ధరించి.. వాటిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ముద్రించుకొని సభ్యులు అసెంబ్లీలోకి అనుమతించకూడదని ఆదేశాలు ఉండటంతో.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను లోపలికి అనుమతించలేదని డీసీపీ శిల్పవల్లి మీడియాతో పేర్కొన్నారు. టీషర్టులు మార్చుకుని సభకు వెళ్లాలని సూచించామని, కానీ.. బీఆర్‌ఎస్‌ నేతలు నిరసనకు దిగడంతో వారిని అరెస్టు చేసి తెలంగాణ భవన్‌కు తరలించామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసుల అదుపులో యూట్యూబర్‌ నందన

సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు హేయం
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 05:53 AM