పోలీసుల అదుపులో యూట్యూబర్ నందన
ABN , Publish Date - Sep 08 , 2026 | 05:42 AM
ప్రముఖ యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ నందనను హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వీసా రెన్యువల్స్, లండన్‌లో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్టు
లండన్‌లో ఉద్యోగాల పేరుతో యూట్యూబర్ భారీగా వసూళ్లు!
నేడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలింపు
ఇబ్రహీంపట్నం/శంషాబాద్ రూరల్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ నందనను హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వీసా రెన్యువల్స్, లండన్‌లో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో గుర్తింపును ఉపయోగించుకొని గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌లో డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో కార్యాలయాలు నిర్వహిస్తూ మోసం చేశారని పలువురు బాధితులు ఆరోపించారు. వీసా రెన్యువల్, తన భార్యకు ఉద్యోగం కోసం సీఓఎస్ ఇప్పిస్తామని తన వద్ద జాగర్లమూడి రమానందన అలియాస్ నందన, ఆమె భర్త మధుకర్‌లు రూ. 15 లక్షలు తీసుకుని మోసం చేశారని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన మామిళ్లపల్లి శివ క్రాంతికుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో నందన కుటుంబంపై గత ఏడాది డిసెంబరులో కేసు నమోదైంది. ఈ కేసులో ఏ-1గా నందన, ఏ-2 ఆమె భర్త మధుకర్, ఏ-3గా ఆమె మామ మోహన్‌రావులను పేర్కొంటూ ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం లుకౌవుట్ నోటీసులు జారీ చేశారు. నందన ఆచూకీ కోసం ఏ-3 మోహన్‌రావును విచారించగా, తన కుమారుడు, కోడలు ఎక్కడున్నారో తెలియదంటూ తప్పించుకున్నారు. ఆయనకు 41 నోటీసులు జారీ చేశారు. బ్రిటన్‌లో నివాసం ఉండే నందన.. సోమవారం హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమైంది. లుకౌట్ నోటీసులు ఉండటంతో వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందింది. ఇబ్రహీంపట్నం పీఎస్‌లోని లేడీ ఎస్సై సత్యావతిని హైదరాబాద్ పంపి నందనకు 35 బీఎన్‌ఎస్ నోటీసులు అందించారు. మంగళవారం ఆమెను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తీసుకురానున్నట్లు సీఐ ఎ.సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జన్వాడ వెంచర్‌పై కొరడా!
సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు హేయం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News