Share News

బీజేపీ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం

ABN , Publish Date - Sep 08 , 2026 | 05:12 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ సోమవారం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బారికేడ్లను దాటుకుంటూ, పోలీసుల ఆంక్షలను ఛేదించుకుంటూ పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ మెయిన్‌ గేటు వద్ద ఆందోళనకు దిగారు.

బీజేపీ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం
Ramachandar rao

  • ఫీజు బకాయిల విడుదలకు డిమాండ్‌

  • అసెంబ్లీ మెయిన్‌గేటు వద్దకు బీజేపీ శ్రేణులు

  • నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట

  • పలువురి అరెస్టు.. పీఎస్‌కు తరలింపు

  • విద్యార్థుల సమస్యలు మీకు పట్టవా?

  • మా ఉద్యమం ఆగదు: రాంచందర్‌రావు

  • సమస్యలపై మేం గొంతెత్తితే అరెస్టు

  • చేయడం ప్రజాస్వామ్య పాలనా?: కిషన్‌రెడ్డి

  • అసెంబ్లీలో బీజేపీ నిరసన.. వాకౌట్‌

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, గన్‌పార్క్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ సోమవారం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బారికేడ్లను దాటుకుంటూ, పోలీసుల ఆంక్షలను ఛేదించుకుంటూ పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ మెయిన్‌ గేటు వద్ద ఆందోళనకు దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావుతోపాటు పార్టీ నాయకులు, శ్రేణులు వ్యూహాత్మకంగా అసెంబ్లీ వద్దకు దశలవారీగా చేరుకుని, అసెంబ్లీ ప్రాంగణలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. రాంచందర్‌రావును పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్తున్న క్రమంలో ఆ వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో, మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలకు స్వల్ప గాయాలయ్యాయి. రాంచందర్‌రావు, సీనియర్‌ నాయకులు ఎన్వీ సుభాష్‌, జీ మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ప్రభాగౌడ్‌, గణేశ్‌కుందేతో పాటు పెద్దసంఖ్యలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసుస్టేషన్‌లకు తరలించారు. అనంతరం విడిచిపెట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిల విడుదల కోసం తాము చేపట్టిన పోరాటం ఆగబోదని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విద్యార్థుల సమస్యను కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 8 లక్షల మంది విద్యార్థుల సంతకాలతో ముఖ్యమంత్రిని కలుస్తామని విజ్ఞప్తి చేశాం. కానీ, సీఎం స్పందించలేదు. సీఎం ఢిల్లీకి వెళ్తున్నారు.. వస్తున్నారు గానీ విద్యార్థుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. 8 లక్షల మంది విద్యార్థుల సంతకాలతో చీఫ్‌ సెక్రటరీని కలవడానికి వెళ్తే సెక్రటేరియట్‌ గేటు దగ్గరే మమ్మల్ని అడ్డుకున్నారు. బీజేపీ శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?’ అని నిలదీశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, 22-ఏ భూముల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగకుండా కాంగ్రె్‌స-బీఆర్‌ఎస్‌ కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ఒకరు నల్ల డ్రెస్‌, మరొకరు తెల్ల డ్రెస్‌ వేసుకుని తిట్టుకున్నట్లు నటించడం తప్ప.. ప్రజల సమస్యలపై చర్చ మాత్రం జరగడం లేదన్నారు. ‘బీజేపీ ఉద్యమం ఆగదు. అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా పోరాడతారు, అసెంబ్లీ బయట ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ప్రభుత్వం మెడలు వంచైనా సరే..రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేసే వరకు పోరాడుతాం’ అని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. బీజేపీ నేతల అరెస్టుపై ఎంపీ డీకే అరుణ స్పందిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన బీజేపీ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని బీజేపీ ఎంపీ డాక్టర్‌ కె లక్ష్మణ్‌ హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కంటే దారుణంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మనోహర్‌రెడ్డి ఆరోపించారు.


నిరంకుశ పాలన: కిషన్‌రెడ్డి

తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన అందిస్తామని గొప్పలు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పార్టీ.. ఇప్పుడు ప్రజా సమస్యలపై గొంతెత్తితే అరెస్టులు, ప్రశ్నిస్తే నిర్బంధాలు, నిరసన తెలిపితే లాఠీలతో సమాధానం చెబుతోందని అని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును అసెంబ్లీ వద్ద బలవంతంగా లాక్కెళ్లి అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని, పార్టీ నాయకులు, బీజేవైఎం కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధించడం కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పెరుగుతున్న అసహనానికి, అభద్రతకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ లోపల బీజేపీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా అడ్డుకోవడం.. సభ బయట ప్రజల తరఫున గొంతెత్తుతున్న బీజేపీ నాయకులను పోలీసులతో అరెస్టు చేయించడం.. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు. పక్కా నియంతృత్వమని విమర్శించారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయలేక పోలీసుల వెనుక దాక్కుంటారా? అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు. రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 22ఏ భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.


అసెంబ్లీలో బీజేపీ నిరసన.. వాకౌట్‌

శాసనసభలో బీజేపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఒకవైపు స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యల మీద చర్చ జరుగుతుండగా... మరోవైపు బీజేపీ సభ్యులు నిరసన చేపట్టారు. 22-ఏ అంశంపై వెంటనే చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, సీఎం రేవంత్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేసినా.. వారు శాంతించలేదు. బీజేపీ సభ్యులు స్పీకర్‌ వైపు దూసుకురాకుండా ఉండేందుకు మార్షల్స్‌ అడ్డుగోడలా నిలబడ్డారు.


అక్బరుద్దీన్‌తో కరచాలనం

బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేస్తూ బయటకు వెళ్లే సమయంలో... ఎంఐఎంఎల్పీ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే అహ్మద్‌ బలాలా చివరి వరుసలో ఒకే బెంచీలో కూర్చున్నారు. బీజేపీ సభ్యులందరూ సభ నుంచి బయటకు వెళ్తూ అక్బరుద్దీన్‌తో కరచాలనం చేసి కుశలప్రశ్నలు వేయటం, నవ్వులు చిందించటం ఆసక్తికరంగా కనిపించింది.


ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకునే అధికారం పోలీసులకు లేదు

సభలో వందేమాతరం పూర్తి చరణాల ఆలాపన
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 05:12 AM