Share News

సభలో వందేమాతరం పూర్తి చరణాల ఆలాపన

ABN , Publish Date - Sep 08 , 2026 | 04:58 AM

శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజే సభలో రభస చోటుచేసుకుంది. రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌-1908లోని సెక్షన్‌-22(ఏ)లో చేర్చిన నిషేధిత భూముల జాబితాపై తాము ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై చర్చించాలని బీజేపీ సభ్యులు నిరసనకు దిగారు.

సభలో వందేమాతరం పూర్తి చరణాల ఆలాపన
TG Assembly

  • 22ఏపై తొలిరోజే రచ్చ

  • అసెంబ్లీలో తమ వాయిదా

  • తీర్మానంపై చర్చకు బీజేపీ పట్టు

  • స్పీకర్‌ పోడియం వద్ద నిరసన

హైదరాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజే సభలో రభస చోటుచేసుకుంది. రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌-1908లోని సెక్షన్‌-22(ఏ)లో చేర్చిన నిషేధిత భూముల జాబితాపై తాము ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై చర్చించాలని బీజేపీ సభ్యులు నిరసనకు దిగారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ అనుమతించకపోవటంతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.స్పీకర్‌ పోడియం వైపు దూసుకెళుతుండగా... వారిని మార్షల్స్‌ అడ్డుకున్నారు. దాంతో పోడియం ముందు నేలపై బైఠాయించారు. 22ఏ జాబితాపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ సభ్యుల తీరును శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఖండించారు. 22ఏపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో చర్చించి చర్చ చేపడతామని తెలిపారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం నడుచుకుంటుందని స్పష్టంచేశారు. ఆ వెంటనే బీజేపీ సభ్యుల చేతుల్లోని ప్లకార్డులను స్వాధీనం చేసుకోవాలని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ మార్షల్స్‌ను ఆదేశించారు. ప్రశ్నోత్తరాల అనంతరం బీఏసీలో చర్చించి స్వల్పకాలిక చర్చ చేపడతామని స్పీకర్‌ తెలిపారు. అయినా బీజేపీ సభ్యులు శాంతించలేదు. ఈ సమయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోక్యం చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేపట్టాలని శాసనసభ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపి ఏడాది అవుతన్నా స్పందన లేదని ఎదురుదాడికి దిగారు. వాళ్లు (బీఆర్‌ఎస్‌) సభ బయట, మీరు (బీజేపీ) లోపల ఉండి మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఆ తర్వాత సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. 22ఏ సీరియస్‌ అంశమని, బీఏసీలో నిర్ణయం తీసుకొని చర్చించేందుకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రశ్నోత్తరాల్లో కీలకమైన అంశాలు చాలా ఉన్నందున సభను నియంత్రణలో పెట్టాలని స్పీకర్‌ను కోరారు. బీజేపీ సభ్యులు శాంతించకపోవడంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. వందేమాతరం పూర్తి చరణాల ఆలాపన అసెంబ్లీ ప్రారంభం కాగానే తొలుత సభలో వందేమాతరం పూర్తి చరణాలను అలపించారు. ఆ తర్వాత జనగణమన, జయజయహే తెలంగాణ గీతాలాపన జరిగింది. సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ ప్రకారం బీఆర్‌ఎస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సభలో వెనుక సీట్లలో కూర్చున్నారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ అయిన కొండా సురేఖ తొలిరోజు సభకు రాలేదు.


ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకునే అధికారం పోలీసులకు లేదు

సీతక్క భావోద్వేగం.. స్పీకర్‌ కంటతడి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 04:58 AM