సీతక్క భావోద్వేగం.. స్పీకర్ కంటతడి
ABN , Publish Date - Sep 08 , 2026 | 04:41 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు దుర్భాషలాడటంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభలో కంటతడి పెట్టారు. సోమవారం ఉదయం నల్ల చొక్కాలతో సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోవటంతో తీవ్ర గలాటా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్ సభ్యుల దుర్భాషలపై చర్చ
స్పీకర్‌ను అవమానిస్తారా.. సీతక్క ఆగ్రహం
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్
ఆమె మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ కంటతడి
హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు దుర్భాషలాడటంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభలో కంటతడి పెట్టారు. సోమవారం ఉదయం నల్ల చొక్కాలతో సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోవటంతో తీవ్ర గలాటా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై సభలో మధ్యాహ్నం చర్చ జరిగింది. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడారు. స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘ఎప్పుడో చనిపోయిన మీ (స్పీకర్) అమ్మగారిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు దూషించటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను’ అంటూ సీతక్క కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ కూడా కంటతడి పెట్టారు. దీంతో సభలో కొద్దిసేపు గంభీర వాతావరణం నెలకొంది. బీఆర్‌ఎస్ సభ్యుల తీరుతో స్పీకర్ మాతృమూర్తి ఆత్మ క్షోభిస్తోందని సీతక్క అన్నారు. ‘అణగారిన వర్గాలు అత్యున్నత పదవిలో కూర్చుంటే సహించలేరా? సభకు వస్తే దళిత బిడ్డను అధ్యక్షా! అని సంభోదించాల్సి వస్తుందనే కేసీఆర్ రావటంలేదు. బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో నీతులు మాట్లాడిన కేసీఆర్... తన పార్టీ సభ్యులకు ఈ సంస్కారమే నేర్పించి సభకు పంపించారా? గతంలో దళితులు వేదాలు వింటే చెవుల్లో సీసం పోసిన ఉదంతాలున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ భావజాలం కూడా అదే. దుర్భాషలకు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్. దొర అహంకారం, దురహంకారంతో ఆయన మాట్లాడుతున్నారు. దళితులంటే కేసీఆర్ కుటుంబానికి నచ్చదు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్కను ఆ పదవి నుంచి తొలగించారు. డిప్యూటీ సీఎం రాజయ్యను బర్తరఫ్ చేశారు. నేరెళ్ల గ్రామంలో దళితులపై దాడులు చేశారు. గతంలో సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి కూడా స్పీకర్‌ను ఉద్దేశించి నీ సొత్తు కాదు అని మాట్లాడారు. ఇప్పుడు ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలు లకారాన్ని వాడుతూ... వాడు, వీడు అని స్పీకర్‌ను దూషించారు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాతా మధు, నవీన్‌రెడ్డిల శాసన మండలి సభ్యత్వాలను రద్దుచేసి.. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. స్పీకర్‌కు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీతక్క కన్నీరు పెట్టుకోవటంతో నాకూ దుఃఖం ఆగలేదు: స్పీకర్
ఎమ్మెల్సీ తాతా మధు తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై సభలో చర్చ సందర్భంగా మంత్రి సీతక్క కన్నీరు పెట్టుకోవటంతో తనకూ దుఃఖం ఆగలేదని చెప్పారు. సోమవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. తాతా మధు వ్యాఖ్యలపై శాసనసభలో తీర్మానం చేసి.. మండలికి పంపుతామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రణరంగం
రాష్ట్రంలో ‘సర్’ గడువు పొడిగింపు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News