రాష్ట్రంలో ‘సర్’ గడువు పొడిగింపు
ABN , Publish Date - Sep 08 , 2026 | 03:46 AM
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును పొడిగిస్తూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణతో పాటు వాటిపై నోటీసుల జారీ, విచారణ, పరిష్కారం, తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సంబంధించిన గడువు తేదీలను సవరించింది.
క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు అక్టోబరు 7 వరకు అవకాశం
నవంబరు 5 వరకు నోటీసులు, విచారణ.. 9న తుది జాబితా
సవరించిన షెడ్యూల్ విడుదలచేసిన ఎన్నికల సంఘం
హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును పొడిగిస్తూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణతో పాటు వాటిపై నోటీసుల జారీ, విచారణ, పరిష్కారం, తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సంబంధించిన గడువు తేదీలను సవరించింది. ఈ మేరకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గత షెడ్యూల్ ప్రకారం క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 16 వరకు అవకాశం ఉండగా.. ప్రస్తుతం సవరించిన షెడ్యూల్‌లో ఈ గడువును అక్టోబరు 7 వరకు పొడిగించారు. దీంతో ఓటర్ల జాబితాలో తమ పేరు, చిరునామా, ఇతర వివరాలకు సంబంధించి మార్పులు, అభ్యంతరాలు ఉన్నవారికి మరింత సమయాన్ని వినియోగించుకునే అవకాశం లభించింది. క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై నోటీసుల జారీ, విచారణ, పరిష్కార ప్రక్రియకు సంబంధించిన గడువును కూడా ఎన్నికల సంఘం పెంచింది. గత షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 15 వరకు ఉన్న ఈ గడువును.. సవరించిన షెడ్యూల్‌లో నవంబరు 5 వరకు పొడిగించారు. దీంతో ‘సర్’లో వచ్చిన అభ్యంతరాలను సంబంధిత ఎన్నికల అధికారులు పరిశీలించి, అవసరమైన విచారణ అనంతరం నిర్ణయం తీసుకునేందుకు అదనపు సమయం అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రక్రియలు పూర్తయిన అనంతరం నవంబరు 9న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు ఈసీ పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ పౌడర్‌తో గంటలో శుభ్రమైన నీరు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News