ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకునే అధికారం పోలీసులకు లేదు
ABN , Publish Date - Sep 08 , 2026 | 04:51 AM
ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకునే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ లోపలికి వెళ్లే క్రమంలో ఎమ్మెల్యేలు ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించినట్లు నిరూపణ అయితే స్పీకర్ చర్యలు తీసుకుంటారని పేర్కొంది.
సబిత, సునీత బ్లాక్ టీ షర్ట్‌లు ధరించలేదు కదా..
మరి వారిని ఎందుకు అడ్డుకున్నారు
మహిళా ఎమ్మెల్యేలపై పురుష పోలీసుల బలప్రయోగమా?
బాధ్యులైన పోలీసులను గుర్తించి చర్యలు తీసుకోండి: హైకోర్టు
హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకునే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ లోపలికి వెళ్లే క్రమంలో ఎమ్మెల్యేలు ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించినట్లు నిరూపణ అయితే స్పీకర్ చర్యలు తీసుకుంటారని పేర్కొంది. ‘‘మహిళా ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు మరికొందరు నల్లని టీ-షర్ట్‌లు ధరించలేదు కదా.. వారిపైన కూడా పోలీసులు ఎందుకు బల ప్రయోగం చేశారు’’ అని ప్రశ్నించింది. ‘‘పోలీసులు అత్యుత్సాహంగా ప్రవర్తించడం సమంజసం కాదు. అసెంబ్లీ ఎదుట ఈ గలాటా ఏంటి’’ అంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అసెంబ్లీ అయినా ఇతర ఏ ప్రదేశమైనా మహిళలపై చేయి చేసుకోవడాన్ని సహించబోమనివ్యాఖ్యానించింది. అసెంబ్లీ ఎదుట జరిగిన ఘటనలను పరిశీలించి, తప్పు చేసిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ చర్యల అమలుపై నివేదిక అందజేయాలని డీజీపీకి ఆదేశాలు జారీచేసింది. అంతకుముందు, తమ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని, ఎమ్మెల్యేలపై బలప్రయోగం చేశారని బీఆర్‌ఎస్‌ఎల్పీ తరఫున ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదిస్తూ.. అసెంబ్లీలోనికి వెళ్లడం ఎమ్మెల్యేల చట్టబద్ధమైన హక్కు అని, అడ్డుకునే అధికారం పోలీసులకు లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీ-షర్ట్‌లు ధరించారని, అంతమాత్రాన వారిని అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోలేరని వాదించారు. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిలను పురుష పోలీసులు నెట్టివేశారని, గొంతు పట్టుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ధర్మాసనానికి సమర్పించారు. హోంశాఖ తరఫున న్యాయవాది మహేశ్‌రాజే వాదిస్తూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ బిజినెస్ రూల్స్‌లోని రూల్ 316, క్లాజ్ 13, 15లను(స్పీకర్ అనుమతి లేకుండా బ్యాడ్జీలు, ఫ్లాగ్స్, గుర్తులు, ఇతర ప్రదర్శనలు చేయరాదు) ఉల్లంఘించారని పేర్కొన్నారు. రాజకీయపరమైన నినాదాలు రాసి ఉన్న బ్లాక్ టీ-షర్ట్‌లు ధరించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినందుకే పోలీసులు అడ్డుకొని ఉండొచ్చని పేర్కొన్నారు. ఫొటోలను పరిశీలించిన ధర్మాసనం.. ఎలాంటి టీ-షర్ట్‌లు ఽధరించనప్పటికీ సబిత, సునీతలను పురుష పోలీసులు అడ్డుకోవడం, చేయి చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి ‘అనుమతించాం’ అని హోంశాఖ తరఫు న్యాయవాది చెప్పడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ఎమ్మెల్యేలకు అనుమతి అవసరం లేదు. అసెంబ్లీలోకి వెళ్లడం ఎమ్మెల్యేల హక్కు’’ అని స్పష్టం చేసింది. అసెంబ్లీ బయట ఘటనలు, బాధ్యులైన పోలీసులపై తీసుకునే చర్యలపై వివరణ కోరుతూ హోంశాఖ, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సైఫాబాద్ ఎస్‌హెచ్‌వో, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీచేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రణరంగం
సీతక్క భావోద్వేగం.. స్పీకర్ కంటతడి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News