Share News

జన్వాడ వెంచర్‌పై కొరడా!

ABN , Publish Date - Sep 08 , 2026 | 05:31 AM

గండిపేట జలాశయానికి ఉరివేస్తూ.. 111 జీవోకు తూట్లు పొడుస్తూ.. జన్వాడ గ్రామంలో అక్రమంగా ఏర్పాటు చేసిన 60 ఎకరాల లేఅవుట్‌పై చర్యలు ప్రారంభమయ్యాయి. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ), హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి కూల్చివేతలు చేపట్టారు.

జన్వాడ వెంచర్‌పై కొరడా!
Janwada

  • 60 ఎకరాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

  • రోడ్లు, డ్రైనేజీ, కట్టడాల తొలగింపు

  • క్లబ్‌ హౌస్‌ భారీ పిల్లర్లు, స్లాబ్‌ల కూల్చివేత

  • సీఎంసీ, హెచ్‌ఎండీఏ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలు

  • మూడు జోన్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌

  • 16 నిర్మాణాల కూల్చివేత.. మరో 15 గుర్తింపు

నార్సింగి/శంకర్‌పల్లి/హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): గండిపేట జలాశయానికి ఉరివేస్తూ.. 111 జీవోకు తూట్లు పొడుస్తూ.. జన్వాడ గ్రామంలో అక్రమంగా ఏర్పాటు చేసిన 60 ఎకరాల లేఅవుట్‌పై చర్యలు ప్రారంభమయ్యాయి. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ), హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి కూల్చివేతలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామంలో అక్రమ వెంచర్‌ ఏర్పాటు చేస్తుండడంపై ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 5న ‘60 ఎకరాల్లో అరాచకం’ శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనంపై స్పందించిన హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్‌, సీఎంసీ అధికారులు రెండు రోజుల క్రితమే క్షేత్రస్థాయిలో పర్యటించి జన్వాడలోని 60 ఎకరాల్లో చేస్తున్న అక్రమ వెంచర్‌ను గుర్తించారు. వెంచర్‌లో రోడ్ల నిర్మాణం, ఫుట్‌పాత్‌లు, డ్రైనేజీ కోసం కాంక్రీట్‌ నిర్మాణాలు చేపడుతున్నట్లు నిర్ధారించారు. దీనిపై సదరు రియల్టర్లకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. మరోవైపు ఈ నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని శంకర్‌పల్లి తహసీల్దార్‌.. నార్సింగి సర్కిల్‌ మున్సిపల్‌ అధికారులకు లేఖ రాశారు. దీంతో సోమవారం సీఎంసీ నార్సింగి డివిజన్‌ అధికారులు, హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం సిబ్బంది సంయుక్తంగా కూల్చివేతలు చేపట్టారు. వెంచర్‌లో క్లబ్‌హౌస్‌ కోసం 2వే ల గజాలకు పైగా స్థలంలో సెల్లార్‌ను తవ్వి, కాంక్రీట్‌తో నిర్మించిన పిల్లర్లను ఎక్స్‌కవేటర్‌లతో కూల్చివేశారు. దీంతోపాటు వెంచర్‌లో కీలకగా ఉండే రోడ్లు, ఫుట్‌పాత్‌లు, బాక్స్‌ డ్రెయిన్‌లను పూర్తిగా ధ్వంసం చేశారు. 111 జీవో పరిధిలో ఎవరైనా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు. కాగా, అక్రమ నిర్మాణాలపై చర్యలు ప్రారంభించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


సీఎంసీలో 16 నిర్మాణాల కూల్చివేత

అనధికార నిర్మాణాలపై సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ) కొరడా ఝళిపిస్తోంది. నిబంధనలను ఉల్లంఘించిన నిర్మాణాలను గుర్తించి, వాటిపై చర్యలు చేపట్టేందుకు మూడు జోన్ల పరిధిలో క్షేత్రస్థాయి తనిఖీలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. సోమవారం 16 అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతోపాటు మరో 15 అనధికార నిర్మాణాలను గుర్తించారు. ఓ అనధికార నిర్మాణాన్ని సీజ్‌ చేశారు. కుత్బుల్లాపూర్‌ జోన్‌లో 7 అనధికార నిర్మాణాలను కూల్చివేయగా, శేరిలింగంపల్లి జోన్‌లో 5, కూకట్‌పల్లి జోన్‌లో 4 నిర్మాణాలను కూల్చివేశారు. కాగా, అనధికార నిర్మాణాలను గుర్తించిన తర్వాత నిర్దేశిత విధానాలను పాటిస్తూ గుర్తింపు, నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు పర్యటించి అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యలు చేపట్టాలని సీఎంసీ కమిషనర్‌ జి.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..
బీజేపీ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం

సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు హేయం
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 05:31 AM