Share News

సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు హేయం

ABN , Publish Date - Sep 08 , 2026 | 05:23 AM

శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను బీఆర్‌ఎస్‌ నేతలు అత్యంత హేయమైన, అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడి ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. సభా గౌరవాన్ని దిగజార్చేలా ప్రవర్తించిన బీఆర్‌ఎస్‌ నేతలు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు హేయం
Sridhar Babu

  • పోలీసులపై దాడిచేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలి

  • తాతా మధును ఉపేక్షిస్తే స్పీకర్‌ను అగౌరవపర్చినట్లే

  • ఆయనను వెంటనే ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్‌ చేయాలి

  • మంత్రులు దుద్దిళ్ల, కోమటిరెడ్డి, జూపల్లి, వివేక్‌, ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (ఆంధ్రజ్యోతి): శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను బీఆర్‌ఎస్‌ నేతలు అత్యంత హేయమైన, అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడి ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. సభా గౌరవాన్ని దిగజార్చేలా ప్రవర్తించిన బీఆర్‌ఎస్‌ నేతలు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌రావు తక్షణమే స్పందించాలన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడికి తెగబడటం దారుణమని ఆక్షేపించారు. కేటీఆర్‌, పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి, నవీన్‌రెడ్డి, డాక్టర్‌ సంజయ్‌ తదితరులు పోలీసుల కాలర్‌ పట్టుకుని అసభ్య పదజాలంతో దూషించిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ, మండలిలో ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలతో కూడిన చొక్కాలు ధరించకుండా నిషేధం విధించింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ నేతలు క్షమాపణ చెప్పిన తర్వాతే మిగిలిన సభా ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలని సభ్యులు భావిస్తున్నట్లు తెలిపారు.


తాతా మధును ఉపేక్షించొద్దు

స్పీకర్‌ను అగౌరవపర్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధును ఉపేక్షిస్తే... స్పీకర్‌ పదవిని అగౌరవపర్చినట్లేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఒక దళిత స్పీకర్‌పై ఇంత దారుణంగా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. తిట్లకు కేసీఆరే ఆద్యుడని, కేటీఆర్‌ భాష పరిధి దాటిందని మండిపడ్డారు. కేసీఆర్‌ దళిత ద్రోహి అని మంత్రి వివేక్‌ వెంకటస్వామి విమర్శించారు. తాతా మఽధును తక్షణమే బర్తరఫ్‌ చేయాలని మండలి చైర్మన్‌ను కోరారు. అసెంబ్లీ స్పీకర్‌, ఆయన మాతృమూర్తిని దుర్భాషలాడిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు సస్పెన్షన్లను అస్త్రంగా ఉపయోగించిందని ఆరోపించారు. ఇప్పుడు అదే బీఆర్‌ఎస్‌ సభా కార్యక్రమాల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. దళితులపై కేసీఆర్‌కు ప్రేమ లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఏనాడూ బీఆర్‌ఎ్‌సలో దళితులకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ సభ్యులను ఫౌంహౌ్‌సకు పిలిచి సభలో ఎలా వ్యవహరించాలో కేసీఆర్‌ చెప్పినట్లు ఉందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎద్దేవా చేశారు. ఫాంహౌ్‌సను ముట్టడించి కేసీఆర్‌కు చావుడప్పు కొడతామని హెచ్చరించారు. స్పీకర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో కేసీఆర్‌ను ఏ1 నిందితుడిగా చేర్చాలని మరో ఎమ్మెల్యే నాగరాజు డిమాండ్‌ చేశారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. స్పీకర్‌పై తాతా మధు వ్యాఖ్యలకు కేసీఆర్‌ కూడా బాధ్యత వహించాలని ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ఫాంహౌజ్‌ ఎదుట మంగళవారం చావు డప్పు కొడతామని ప్రకటించారు. 80 వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్‌ సంస్కారం ఇదేనా? అని కల్వకుర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ ప్రశ్నించారు. తాతా మధును వెంటనే శాసనమండలి నుంచి సస్పెండ్‌ చేయాలని టీపీసీసీ డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌ ప్రాంగణంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తాతా మధు దిష్టిబొమ్మను సోమవారం దహనం చేశారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన స్పీకర్‌ పదవిలో ఉన్న దళిత నాయకుడిని అవమానించడం బీఆర్‌ఎస్‌ నేతల అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ అంటే ‘బూతు రాష్ట్ర సమితి’ అని ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌ విమర్శించారు. తాతా మధు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ డిమాండ్‌ చేశారు. మధుపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, సభ నుంచి సస్పెండ్‌ చేయాలని కోరారు.


తాతా మధును సస్పెండ్‌ చేయాలి: మహేశ్‌గౌడ్‌

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహే శ్‌కుమార్‌ గౌడ్‌ ఖండించారు. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు, శాసన వ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. తాతా మధు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. శాసన మండలి నిబంధనల ప్రకారం ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటూ సస్పెండ్‌ చేయాలని మండలి చైర్మన్‌ను కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..
బీజేపీ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం

సభలో వందేమాతరం పూర్తి చరణాల ఆలాపన
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 05:23 AM