‘ఎక్స్’ నుంచి ఆ జర్నలిస్టు సమాచారం మీకెందుకు?
ABN , Publish Date - Sep 08 , 2026 | 06:55 AM
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ గురించి బయటపెట్టిన స్వతంత్ర జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ్ కేసులో సుప్రీంకోర్టు యూపీ గాజియాబాద్ పోలీసులపై ప్రశ్నలవర్షం కురిపించింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ‘ఎక్స్’ నుంచి ఆయన సమాచారాన్ని ఎందుకడిగారు..
ప్రమాదకర డ్రైవింగ్ కేసులో ఆయన ఇంటర్నెట్ వివరాల అవసరమేంటి..
యూపీ పోలీసులకు సుప్రీంకోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ, సెప్టెంబరు 7: అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ గురించి బయటపెట్టిన స్వతంత్ర జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ్ కేసులో సుప్రీంకోర్టు యూపీ గాజియాబాద్ పోలీసులపై ప్రశ్నలవర్షం కురిపించింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ‘ఎక్స్’ నుంచి ఆయన సమాచారాన్ని ఎందుకడిగారు.. ఇంటర్నెట్‌లో ఆయన కార్యకలాపాల అవసరమేంటని నిలదీసింది. ఉపాధ్యాయ్ కారును ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ తన మోటారుసైకిల్‌ను ఢీకొట్టారని.. తర్వాత తనను దూషించి బెదిరించారని నిక్కీ గౌతమ్ అనే వ్యక్తి గత నెల 18న గాజియాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు నమోదైంది. దీనిపై అభిషేక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ కోర్టు గత నెల 25న ఆదేశాలిచ్చింది. తాజాగా మళ్లీ విచారించింది. ప్రమాదకర డ్రైవింగ్ కేసు దర్యాప్తులో నిందితుడి డిజిటల్ పాదముద్ర అవసరమేంటో అఫిడవిట్ దాఖలుచేయాలని పోలీసులకు స్పష్టంచేసింది. సదరు సమాచారం ఎందుకో పోలీసులు అఫిడవిట్ వేశాక.. దానిని తదుపరి ఆదేశాలిచ్చేదాకా పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని ఆదేశించింది.