ఏపీ భవన్‌లో రైస్ అవుట్‌లెట్
ABN , Publish Date - Sep 08 , 2026 | 07:03 AM
దేశ రాజధాని న్యూఢిల్లీలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, నిత్యావసర సరుకులు అందించడమే లక్ష్యంగా ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘రైస్ అవుట్‌లెట్’ను సోమవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.
ప్రారంభించిన మంత్రి నాదెండ్ల
తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, సరుకులు
కేఎన్‌ఎం, బీపీటీ అందుబాటులో ఉంచుతాం: నాదెండ్ల
న్యూఢిల్లీ, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని న్యూఢిల్లీలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, నిత్యావసర సరుకులు అందించడమే లక్ష్యంగా ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘రైస్ అవుట్‌లెట్’ను సోమవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు స్వచ్ఛమైన, నాణ్యమైన మన ఊరి రుచులను, వరి వంగడాలను అందించాలనే ఉద్దేశంతోనే రైస్ అవుట్‌లెట్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. కేఎన్‌ఎం, బీపీటీ, తదితర రకాల బియ్యం రకాలతోపాటు, ఎన్‌సీసీఎఫ్ ద్వారా సేకరించిన 64 రకాల నాణ్యమైన సరుకులను కూడా సబ్సిడీ రేట్లతో విక్రయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఏకే జైన్, భవన్ ప్రత్యేక కమిషనర్ అర్జా శ్రీకాంత్, జాయింట్ కమిషనర్ ఎన్వీ రామారావు, ఉన్నతాధికారులు వెంకటరమణ, సునీల్‌సాగర్, సురేశ్‌బాబు, భవన్ సిబ్బంది పాల్గొన్నారు.
కేంద్ర ఉన్నతాధికారులతో నాదెండ్ల భేటీ
నేషనల్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీసీఎఫ్) ఎండీ అనీస్ జోసెఫ్ చంద్రతో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల సరఫరా తీరు, ధరల నియంత్రణ, సరుకులు అందుబాటులో ఉండేలా తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై చర్చించారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేని మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీకి సంబంధించిన ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ఈ వార్తలనూ చదవండి