తిరుమలలో ఏర్పాట్లు అద్భుతం
ABN , Publish Date - Sep 08 , 2026 | 05:06 AM
సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన సజీవ క్షేత్రం తిరుమల అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తిరుమలలోని అద్భుతమైన ఏర్పాట్లు, పరిశుభ్రత, ఆధ్యాత్మిక వాతావరణం మనసును పరవశింపజేశాయన్నారు.
ఆధ్యాత్మిక వాతావరణంతో మనసు పరవశం: యోగి ఆదిత్యనాథ్
తిరుమల, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన సజీవ క్షేత్రం తిరుమల అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తిరుమలలోని అద్భుతమైన ఏర్పాట్లు, పరిశుభ్రత, ఆధ్యాత్మిక వాతావరణం మనసును పరవశింపజేశాయన్నారు. సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. సామాన్య భక్తులు ఆలయంలోకి ప్రవేశించే వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకుని అనంతరం గర్భాలయంలో మూలవిరాట్టును దర్శించుకున్నారు. అనంతరం పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీవారి ఆలయంలో కొలువైన సీతా, లక్ష్మణ, ఆంజనేయస్వామి సమేత శ్రీరామచంద్రమూర్తిని కూడా దర్శించుకున్నారు. రంగనాయక మండపానికి చేరుకున్న యోగి ఆదిత్యనాథ్‌ను వేదపండితులు ఆశీర్వదించగా, అదనపు ఈవో వెంకయ్య చౌదరి లడ్డూప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ వందల సంవత్సరాల క్రితమే ఉత్తరాదిని, దక్షిణాదిని అనుసంధానించే గొప్ప కార్యాన్ని జగద్గురు రామానుజాచార్యులు చేశారన్నారు. కాగా, ఆలయం ముందుకు వచ్చిన యోగి ఆదిత్యనాథ్‌ను చూసిన పలువురు భక్తులు ‘జై శ్రీరాం, జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేశారు. ఆదిత్యనాథ్ వెంట మంత్రులు సత్యకుమార్ యాదవ్, నారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, బీజేపీ నాయకులు భానుప్రకాశ్‌రెడ్డి, కోలా ఆనంద్ ఉన్నారు.
ఈ వార్తలనూ చదవండి
స్పృహ తప్పిన వృద్ధుడికి ఏఎస్‌ఐ సేవలు