Share News

కుటుంబ సభ్యులే వేధిస్తున్నారు..

ABN , Publish Date - Sep 07 , 2026 | 11:55 PM

భర్త మృతి చెందిన తర్వాత కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారంటూ కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామానికి చెందిన విజయలక్ష్మి ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది.

కుటుంబ సభ్యులే వేధిస్తున్నారు..
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

పీజీఆర్‌ఎస్‌లో బాధితురాలి ఫిర్యాదు

మొత్తం 104 అర్జీలు : ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు క్రైం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): భర్త మృతి చెందిన తర్వాత కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారంటూ కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామానికి చెందిన విజయలక్ష్మి ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. భర్త తరపున ఆస్తిలో తనకు రావాల్సిన వాటా ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. పొలంలో వరినాట్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని టూటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను ఎస్పీ నేరుగా స్వీకరించారు. రుణాలు, ఉద్యోగాలు, నాన్‌ రీఫండబుల్‌ ఫండ్‌ కింద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌, రీసెర్చ్‌ సెంటర్లు ఏర్పాటు చేయిస్తామని దళిత శక్తి ఫౌండేషన్‌ పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కొందరు మోసాలకు పాల్పడ్డారని స్టాంటన్‌పురానికి చెందిన మన్సూర్‌ అహ్మద్‌ ఫిర్యాదు చేశారు. విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలో పోర్టు ఏరియాలలో తన కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు శ్రీరామ్‌నగర్‌కు చెందిన లక్ష్మీదేవి ఫిర్యాదు చేశారు. రస్తా ఇవ్వకుండా తన అన్న సుంకన్న ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ, అతనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని క్రిష్ణగిరి మండలం ఆగవెల్లి గ్రామానికి చెందిన పరమేష్‌ ఫిర్యాదు చేశారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జెస్కాంలోని ఎలక్ర్టికల్‌ డిపార్టుమెంట్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఫోర్జరీ సంతకాలతో మోసం చేసి రూ.5లక్షలు తీసుకున్న ఇద్దరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోసిగి చెందిన బాధితుడు ఎస్పీని ఆశ్రయించాడు. కర్నూలు రూరల్‌ దిగువపాడు చెందిన కొందరు వ్యక్తులు ఫోన్‌ కాల్స్‌ చేసి రూ.లక్ష ఇవ్వాలని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారనీ షరీ్‌ఫనగర్‌ చెందిన సాయికుమార్‌ ఫిర్యాదు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ... ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. మొత్తం 104 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ హుస్సేన్‌ పీరా, సీఐలు శివశంకర్‌, ఇస్మాయిల్‌, మస్తాన్‌వలి పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2026 | 11:55 PM