ఈరన్న స్వామికి చక్రస్నానం
ABN , Publish Date - Sep 07 , 2026 | 11:54 PM
ఉరుకుంద ఈరన్నస్వామి పల్లకి మహోత్సవాన్ని ఈవో వాణి ఆధ్వర్యంలో సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఉరుకుంద క్షేత్రంలో వైభవంగా పల్లకి సేవ
కోసిగి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఉరుకుంద ఈరన్నస్వామి పల్లకి మహోత్సవాన్ని ఈవో వాణి ఆధ్వర్యంలో సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 4:30 గంటలకు దేవస్థానం నుంచి స్వామివారి పల్లకి ఊరేగింపు ప్రారంభమై బండమీద, చిరుతపల్లి, కరణి, తిప్పలదొడ్డి, కోసిగి మండల పరిధిలోని కామన్‌దొడ్డి మీదుగా కందుకూరు గ్రామానికి చేరుకుంది. అనంతరం తుంగభద్ర నది తీరంలోని రామలింగేశ్వరస్వామి ఆలయ సమీపానికి స్వామివారి పల్లకి చేరుకోగా... ఆలయ అర్చకులు, అధికారులు, పోలీసుల ఆధ్వర్యంలో తుంగభద్ర నదిలో స్వామివారి మూలవిరాట్‌కు చక్రస్నానం నిర్వహించారు. భక్తుల కోసం తుంగభద్ర నది తీరాన ఉరుకుంద ఈరన్నస్వామి దేవస్థానం ఈవో వాణి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కందుకూరు నుంచి భక్తులు పాదయాత్రగా పల్లకిని మోసుకుంటూ ఉరుకుంద క్షేత్రానికి బయలుదేరారు. దారి పొడవునా భక్తులు పల్లకికి నీరాజనాలు పలుకుతూ స్వామివారి నామస్మరణతో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.