Share News

దారి తప్పుతున్న పోలీసులు!

ABN , Publish Date - Jul 30 , 2026 | 08:03 AM

ప్రజా రక్షణ.. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేయాల్సిన రక్షకభటుల్లో కొంతమంది బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు.

దారి తప్పుతున్న పోలీసులు!
Hyderabad Police

  • మహిళలతో అనైతిక సంబంధాలు

  • కొందరి ప్రవర్తనతో అందరికీ చెడ్డపేరు

  • ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా మారని తీరు

  • పీఎస్‏ల వారీగా డేటా సిద్దం చేస్తున్న ఎస్‌బీ?

హైదరాబాద్‌ సిటీ: ప్రజా రక్షణ.. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేయాల్సిన రక్షకభటుల్లో కొంతమంది బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు. కష్టం వచ్చింది కాపాడండి, మాకు న్యాయం చేయండి అని ప్రాధేయపడుతూ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధిత మహిళలకు అండగా నిలవాల్సింది పోయి, వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు పోలీసుల తీరుతో మొత్తం డిపార్టుమెంట్‌కే చెడ్డపేరు వస్తోందని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలతో ఆ శాఖ అపవాదు మూట గట్టుకుంటోంది.


సిటీ కమిషనరేట్‌ పరిధిలో ఓ ఇన్‌స్పెక్టర్‌ బాధిత మహిళను లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు ఉన్నతాధికారులకు పిర్యాదు రావడం డిపార్టుమెంట్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని ఇన్‌స్పెక్టర్ల వరకు విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై ప్రత్యేక నజర్‌ పెట్టినట్లు సమాచారం. ఎంత మందిపై అక్రమార్జన, అవినీతి, మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి అనే వివరాలపై ఆరా తీయాలని ఎస్‌బీ (స్పెషల్‌ బ్రాంచి) అధికారులను పోలీస్‌ ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది.


  • గతంలో వనస్థలిపురం పరిధిలో ఓ మహిళను పాయింట్‌ బ్లాంక్‌లో తుపాకీ పెట్టి అత్యాచారం చేసిన ఓ ఇన్‌స్పెక్టర్‌ ఉదంతం డిపార్టుమెంట్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అదే పోలీస్ స్టేషన్‌ పరిధిలో సిటీలో పనిచేసే ఓ ఇన్‌స్పెక్టర్‌ మరో మహిళతో కారులో ఏకాంతంగా ఉండగా పెట్రోలింగ్‌ పోలీసులతో పాటు.. అతని భార్య పిల్లలకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

  • సిటీలో ఓ ఇన్‌స్పెక్టర్‌ స్టేషన్‌కు వచ్చిన బాధితురాలితో పరిచయం ఏర్పర్చుకొని ఆ తర్వాత వేఽధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అదే విధంగా స్టేషన్‌లో ఓ మహిళా కానిస్టేబుల్‌ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.


city3.2.jpg

  • వివాహేతర సంబంధం పెట్టుకొని, భార్యను వేధింపులకు గురిచేన్తున్న జూబ్లీహిల్స్‌ జోన్‌లోఎస్సైని సీపీ సజ్జనార్‌ సస్పెండ్‌ చేశారు.

  • ప్రేమ, పెళ్లి పేరుతో మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక దాడికి పాల్పడి.. వేఽధిస్తున్న ఓ ఎస్సైని సైబరాబాద్‌ పోలీసులు గత మేలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

  • సైబరాబాద్‌లోని మరో పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై.. స్టేషన్‌కు వచ్చిన బాధిత మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. రెండేళ్ల క్రితం అదే పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న మరో ఎస్సైని ఇదే తరహా కేసులో ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.


బయటకు వస్తున్నవి కొన్నే..?

మహిళలపై పోలీసుల లైంగిక వేధింపులకు సంబంధించి కొన్ని ఘటనలు మాత్రమే వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. వేఽధింపులు భరించలేని, సహనం కోల్పోయిన వారు మాత్రమే బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. పరువుకు భయపడి కొందరు.. పోలీస్‌ వారితో పెట్టుకుంటే తర్వాత ఎలాంటి కక్ష సాధింపుకు దిగుతారోనని కొందరు బయటకు చెప్పుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.


ఖాకీలకు కౌన్సెలింగ్‌!

పోలీసు శాఖలో రెండేళ్లుగా వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మహిళా పోలీసులతో అనుచిత ప్రవర్తన, వ్యక్తిగత సంబంధాల వివాదాలు, ఆత్మహత్యలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఈ సమస్యపై దృష్టి సారించారు. గాడి తప్పుతున్న పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు పోలీసు సిబ్బందికి క్రమం తప్పకుండా మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్‌ ఇవ్వాలని డీజీపీ సీవీ ఆనంద్‌ అన్ని యూనిట్‌ ఆఫీసర్లను ఆదేశించారు. ఇటీవల రాష్ట్రంలోని యూనిట్‌ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీసు స్టేషన్లలో వ్యవహరించాల్సిన విధానం, పోలీసులపై వచ్చే ఫిర్యాదులపై చర్యలు, నిష్పక్షపాత విచారణపై యూనిట్‌ అధికారులు దృష్టి సారించాలని డీజీపీ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కంగనా.. ఆ చెంపదెబ్బ మరిచావా?

థర్మల్‌ కేంద్రాలు పూర్తిసామర్థ్యంతో పనిచేయాలి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 08:20 AM