Share News

చమురు దెబ్బ

ABN , Publish Date - Jul 30 , 2026 | 02:12 AM

రష్యా చమురు ఆదాయాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశించిన ఆంక్షల బిల్లు అమెరికా సెనేట్‌లో మరింత ముందుకు కదిలింది. 86–12 తేడాతో సెనేట్‌ సభ్యులు పెద్దసంఖ్యలో దానిని పరిశీలించేందుకు ఆమోదం తెలపడంతో...

చమురు దెబ్బ

రష్యా చమురు ఆదాయాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశించిన ఆంక్షల బిల్లు అమెరికా సెనేట్‌లో మరింత ముందుకు కదిలింది. 86–12 తేడాతో సెనేట్‌ సభ్యులు పెద్దసంఖ్యలో దానిని పరిశీలించేందుకు ఆమోదం తెలపడంతో కీలకదశ దాటింది. ‘ఇందులో నీళ్ళు నమలాల్సిందేమీలేదు, భారత్‌, చైనాలను దెబ్బకొట్టడం లక్ష్యంగా తయారైన ఈ బిల్లు అమెరికా మిత్రదేశాలకు ఏ అన్యాయమూ చేయదు, రష్యానుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తూ, అది కదనరంగంలో కదలడానికి సాయపడుతున్నవి ప్రధానంగా ఆ రెండు దేశాలే’ అంటూ కొందరు సెనేటర్లు మీడియా ముందు తీవ్రవ్యాఖ్యలు చేశారు. అంతటి నేరానికి పాల్పడుతున్న ఈ దేశాలకు సరైన శిక్ష విధించే రీతిలో ఈ బిల్లును చక్కగా, అతి జాగ్రత్తగా రూపొందించామని వారు వివరించారు. ట్రంప్‌ సన్నిహితుడు, ఇటీవల రక్తనాళం తెగి అనుమానాస్పద స్థితిలో మరణించిన రిపబ్లికన్‌ పార్టీ సెనేటర్‌ లిండ్సే గ్రాహం ఈ బిల్లు సృష్టికర్త. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే ఈ బిల్లు ముందుకు కదిలేట్టు చేయడంలో వీరంతా విజయం సాధించారు. కరడుగట్టిన రష్యా వ్యతిరేకి లిండ్సే గ్రాహమ్‌ స్మారకార్థం నిర్వహించిన కార్యక్రమంలో జెలెన్‌స్కీ పాల్గొని ఆయనను ఉక్రెయిన్‌ ఆప్తమిత్రుడుగా, శ్రేయోభిలాషిగా అభివర్ణించారు. రష్యాను ఆర్థికంగా చావుదెబ్బ తీయగల ఈ బిల్లు వేగంగా కదులుతున్నందుకు సంతోషిస్తూ దాని సమర్థకులను ఉద్దేశించి ప్రసంగించారు కూడా.

సుదీర్ఘకాలం ఈ బిల్లు రూపకల్పనలో కృషిచేసిన గ్రాహమ్‌, అమెరికా అధ్యక్షుడి అభీష్ఠానికి అనుగుణంగా, ఆయనకు కొన్ని విశేషాధికారాలు కట్టబెట్టే మార్పుచేర్పులు చేసి, ఆయన మద్దతు కూడా సాధించుకున్నారు. రష్యామీద ఆంక్షల విషయంలో అమెరికా కాంగ్రెస్‌కు అధిక అధికారాలు కట్టబెట్టే కొన్ని నిబంధనలను అధ్యక్షుడి అనుగ్రహం కోసం నీరుగార్చారు కానీ, ఇంతలోనే కన్నుమూశారు. గ్రాహం మరణానంతరం ఈ బిల్లులో మరిన్ని మార్పులతో పాటు సుంకాల తీవ్రత కూడా తగ్గింది. అధ్యక్షుడికి పూర్తి అనుకూలంగా ఉన్న ఈ బిల్లును సమర్థించడానికి ఎక్కువమంది డెమోక్రాట్లు ఇప్పటివరకూ సందేహిస్తూ వచ్చారు. అరవైరెండు మంది సంతకాలు చేసిన ఈ బిల్లుకు ఇప్పుడు 86మంది పచ్చజెండా చూపడం ఉక్రెయిన్‌కు మహదానందాన్ని కలిగిస్తోంది. పార్టీలకు అతీతంగా అమెరికా తన పక్షాన ఉన్నదని అది చెప్పుకోవచ్చు. యుద్ధరంగంలో వీరంగాలు వేస్తున్న రష్యా ఈ బిల్లు దెబ్బకు విలవిలలాడిపోతుందని, రష్యన్‌ కులీనులు, ఆర్థికసంస్థలు, ఇంధన ప్రాజెక్టులన్నీ కుప్పకూలి రష్యా కదనరంగాన్ని విడిచిపారిపోతుందని ఉక్రెయిన్‌ ఆశ. ఏడాది క్రితం ఓవల్‌ ఆఫీసులో ట్రంప్‌తో చీత్కారాలు, అవమానాలు ఎదుర్కొన్న జెలెన్‌స్కీతో ఈ పర్యటనలో అదే చోట ట్రంప్ ఎంతో చక్కగా మాట్లాడి, ఆయుధాలు, పేట్రియాట్‌ మిసైళ్ళ తయారీ గురించి మాట్లాడటం ఉక్రెయిన్‌కు అనందం కలిగిస్తోంది. రష్యా ఆయిల్‌ డిపోలు, రిఫైనరీలు, రవాణాకేంద్రాలమీద భారీగా విరుచుకుపడుతూ దాని ఇంధన శక్తిని నిర్వీర్యపరచేందుకు ఉక్రెయిన్‌ శతథా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ బిల్లు ముందడుగువేసింది. ఐదువందల శాతం టారిఫ్‌తో రష్యాను నేరుగా శిక్షించడమే కాక, దానినుంచి భారీగా చమురు కొంటున్న ఐదుదేశాలు, మరీ ముఖ్యంగా చైనా, భారత్‌లను ఈ బిల్లు దారికి తెస్తుంది కనుక, డోనాల్డ్‌ ట్రంప్‌ ఎంత ప్రయత్నించినా లొంగని వ్లాదిమిర్‌ పుతిన్‌ గిలగిలలాడుతూ చర్చలకు దిగివస్తారని ఈ బిల్లు సమర్థకుల నమ్మకం.


గత ఏడాది ఆగస్టులో ‘పుతిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నందుకు’ భారత్‌పై అదనంగా 25 శాతం సుంకాన్ని ట్రంప్‌ విధించారు. భారత్‌పై మొత్తం సుంకాలు ఏకంగా 50 శాతానికి చేరాయి. ఈ చర్య మిత్రదేశాల మధ్య వాణిజ్య చర్చలు ముందుకు సాగకుండా ఆగిపోవడానికి కారణమైంది కూడా. అంతలోనే, ట్రంప్‌ స్వయంగా ఆరంభించిన ఇరాన్‌ యుద్ధం మొదలై, యావత్‌ ప్రపంచం అనిశ్చితిలో జారుకోవడంతో అధ్యక్షులవారే మళ్ళీ మినహాయింపులు ప్రకటించారు. ఆ తరువాత వాటిని కాదనడమే కాక, ఇప్పుడు పశ్చిమాసియాలో పరిస్థితి మళ్ళీ తీవ్రంగా ఉన్నప్పుడు ఈ కొత్త బిల్లుతో దేశాన్ని ఇంధనసంక్షోభంలోకి నెడుతున్నారు.

‘లిండ్సే గ్రాహమ్‌ శాంక్షనింగ్‌ రష్యా యాక్ట్‌’ ఇంకా చాలా దశలు దాటాల్సి ఉన్నప్పటికీ, దాని సమర్థకులు ఆశిస్తున్నట్టుగా సెప్టెంబరు నాటికి అది ఆచరణలోకి వస్తే, ట్రంప్‌ చేతిలో వజ్రాయుధమే అవుతుంది. మొత్తం ముడిచమురు దిగుమతుల్లో సగానికిసగం రష్యా నుంచే చేసుకుంటున్న భారత్‌కు ఇది అసలే కష్టకాలంలో మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. చవుకగా దక్కుతున్న రష్యా చమురుని బాగా తగ్గించుకొని, అమెరికానుంచో, అది అమ్మిపెడుతున్న వెనెజువెలా నుంచో చమురు దిగుమతులు పెంచుకోవలసి వస్తుంది. సుంకాల శాతం అధ్యక్షుడి విచక్షణమీదే ఆధారపడివుంది కనుక, టారిఫ్‌వార్‌లో ఆరితేరిన ట్రంప్‌కు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో భారత్‌ను లొంగదీయడానికి ఇది ఉపకరించవచ్చు.

ఇవి కూడా చదవండి

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు బాక్సర్లు సాక్షి, అరుంధతి.. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం!

విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ.. లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: కేంద్ర మంత్రి అమిత్ షా

Updated Date - Jul 30 , 2026 | 02:12 AM