Share News

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. భాగ్యనగరంలో కీలక మార్పులు

ABN , Publish Date - Apr 09 , 2026 | 04:47 PM

భాగ్యనగరంలోని కీలకమైన షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌ నుంచి మాసాబ్‌ ట్యాంక్‌ వరకు ట్రాఫిక్‌ కష్టాలను తీర్చి, ఈ మార్గాన్ని 'మోడల్‌ కారిడార్‌'గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్, ఐపీఎస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌, ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.

ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. భాగ్యనగరంలో కీలక మార్పులు
Hyderabad Development

హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలోని కీలకమైన షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌ నుంచి మాసాబ్‌ ట్యాంక్‌ వరకు ట్రాఫిక్‌ కష్టాలను తీర్చి, ఈ మార్గాన్ని 'మోడల్‌ కారిడార్‌'గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్, ఐపీఎస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌, ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. అధికారులందరూ కలిసి ఒకే బస్సులో ప్రయాణిస్తూ.. మార్గమధ్యలో ఉన్న బాటిల్‌ నెక్‌లు (ట్రాఫిక్‌ అడ్డంకులు), నీరు నిలిచే ప్రాంతాలు, ఆక్రమణలను స్వయంగా పరిశీలించి తక్షణ పరిష్కార మార్గాలను సూచించారు.


పాదచారుల భద్రతకు పెద్దపీట:

ఎస్‌డిఐ హాస్పిటల్‌ వద్ద, బృందావన్‌ కాలనీ రోడ్‌ నంబర్-1 వద్ద కొత్తగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల (FOB)ను నిర్మించాలని నిర్ణయించారు. షేక్‌పేట్‌ నాలా వద్ద పెలికాన్‌ సిగ్నల్‌, జీబ్రా క్రాసింగ్‌లను ఏర్పాటు చేయనున్నారు.

జంక్షన్ల పునర్నిర్మాణం:

నానల్‌ నగర్‌ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ సాఫీగా సాగేందుకు వీలుగా అక్కడ ఉన్న రోటరీ (Rotary) వెడల్పును తగ్గించి, రహదారిని విస్తరించాలని అధికారులను ఆదేశించారు.

SAJJANAR-1.jpg


రోడ్డు విస్తరణ:

రేతిబౌలి నుంచి నానల్‌ నగర్‌ వరకు ఉన్న సెంట్రల్‌ మీడియన్‌ను, అడ్డంగా ఉన్న చెట్లను తొలగించి రోడ్డును వెడల్పు చేయనున్నారు. ఎన్ఎండీసీ, డెల్ స్టోర్ ప్రాంతాల్లో మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం భూసేకరణ చేపట్టి రహదారి విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు.

వాహనాల రాకపోకలకు మార్గం సుగమం..

రహదారి మధ్యలో ఉన్న రామాలయం ఆర్చ్‌, బొడ్రాయి, అలాగే షేక్‌పేట్‌ నాలా సమీపంలోని సమాధులను తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని కమిషనర్లు ఆదేశించారు. మాసాబ్‌ ట్యాంక్‌ ఫ్లైఓవర్‌ వద్ద ఎత్తు పరిమితి బారియర్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. మెహదీపట్నం వైపు ఉన్న ఎలక్ట్రికల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించి, పోచమ్మ బస్తీ నుంచి రోడ్ నంబర్ 12కు నేరుగా వెళ్లేలా స్లిప్‌ రోడ్డును అభివృద్ధి చేయనున్నారు.

SAJJANAR-2.jpg


ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం: సజ్జనార్‌

ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా తక్షణమే చేయదగ్గ పనులు, దీర్ఘకాలిక పనులను గుర్తించామని హైదరాబాద్ సీపీ సజ్జనార్‌, ఐపీఎస్ పేర్కొన్నారు.

ఆ పనులను రెండేళ్లలో పూర్తి చేస్తాం: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌

నగరంలోని ట్రాఫిక్‌ పనుల నిమిత్తం ప్రతి జోన్‌కు రూ. 20 కోట్ల చొప్పున మొత్తం రూ. 120 కోట్లు కేటాయిస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ వెల్లడించారు. కేబీఆర్‌ పార్క్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డి.జోయల్ డెవిస్ ఐపీఎస్ (జాయింట్ సీపీ ట్రాఫిక్), జి ముకుంద రెడ్డి ఐఏఎస్ (జోనల్ కమిషనర్), ప్రియాంక ఆలా ఐఏఎస్ (జోనల్ కమిషనర్), కాజల్ ఐపీఎస్ (డీసీపీ ట్రాఫిక్), కె. శ్రీనివాస్ (చీఫ్ సిటీ ప్లానర్), ఎస్.రత్నాకర్ (చీఫ్ ఇంజనీర్), వేణుగోపాల్ రెడ్డి (అడిషనల్ డీసీపీ), డి. ధనలక్ష్మి (ఏసీపీ ట్రాఫిక్ గోల్కోండ) ఇతర అధికారులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాళేశ్వరంపై విచారణ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై తీర్పును వాయిదా వేసిన హైకోర్టు

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోంది: కవిత

ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 09 , 2026 | 04:58 PM